పదవులే రాజకీయ పరమావధి
మోత్కుపల్లి వ్యవహారమే తాజా ఉదాహరణ
హైదరాబాద్,మే29(జనం సాక్షి): రాజకీయాల్లో విలువలు లేవని, వ్యక్తులకు పార్టీల పట్ట విశ్వాసం కన్నా పదవులపైనే మోహం ఉందనడానికి తాజా ఉదాహరణ మోత్కుపల్లి నర్సింహులు. టిడిపిలో అనేక పదవులు అనుభవించి, చంద్రబాబు అడుగలకు మడుగులొత్తి, తెలంగాణను, కెసిఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన మోత్కుపల్లి సడన్‌గా యూ టర్న్ తీసుకున్నాడు. ఉద్యమ సమయంలో కెసిఆర్ తెలంగాణ వాడు కాదని, విజయనగరం నుంచి వలస వచ్చాడని పదేపదే ప్రచారం చేయడంలో మోత్కుపల్లి ముందున్నారు. టిడిపిలో అనేక పదవులు అనుభవించి, రాజకీయంగా ఎదిగి ఆ పార్టీని, దాని అధినేతలను ఇప్పుడే తిట్టాల్సి రావడం వెనక కారణాలు బహిరంగ రహస్యం. రాజ్యసభ సీటు, గవర్నర్ గిరీ ఆశించి భంగపడి, కనీసం టిటిడి బోర్డు మెంబర్ పదవి దక్కకపోవడంతో ఇప్పుడు అధినేతపై విమర్శలు గుప్పించడం అవసరామా? అన్నది ఆలోచనచేయలేకపోయారు. పార్టీ మారదల్చుకుంటే మారాలి. అంతేగానీ ఆనాడు ఏ విసయంలోనూ నోరు మెదపకుండా ఇప్పుడు విమర్శలు చేస్తే ప్రజలు నమ్మరని
మోత్కుపల్లి గురతించడం లేదు. అందుకే మోత్కుపల్లి నర్సింహులుపై ఆ పార్టీ వేటు వేసింది. పార్టీకి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరిస్తుండడం వల్ల ఆయనను బహిష్కరిస్తున్నట్లు తెదేపా జాతీయాధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఒకవైపు ఆ పార్టీ మహానాడు సంబరాలు చేసుకుంటుండగా.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి నివాళులు అర్పించిన మోత్కుపల్లి సమాధిపై వాలిపోయి కన్నీరు పెట్టుకున్న తీరు దొంగ ఏడ్పుల కాక మరోటి కాదు. చంద్రబాబు కుట్రలకే ఎన్టీఆర్ బలయ్యారంటూ ఓ రెండు దశాబ్దాల తరవాత చెబితే నమ్ముతారా అన్నది గ్రహించాలి. పార్టీలో ఉండగా చంద్రబాబు వెన్నుపోటును సమర్థించి ఇప్పుడు విమర్శిస్తే ప్రజలు వెర్రిబాగుల వాళ్లు కాదు. చంద్రబాబు రాజకీయాల కోసమే ఎన్టీఆర్ పేరును వాడుకుంటూ నందమూరి వంశాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించినంత మాత్రాన మోత్కుపల్లి సచ్చీలురుకాలేరు. అందుకే పార్టీ నియామవళి, క్రమశిక్షణ పాటించనందున మోత్కుపల్లిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ నాయకత్వం, నాయకులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నట్లు తెదేపా తెలంగాణ శాఖ ఇచ్చిన లేఖలోని అంశాల ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లుగా ఓ ప్రకటన విడుదల చేశారు. మోత్కుపల్లి వ్యాఖ్యలతో పార్టీకి తీవ్రనష్టం జరుగుతోందని లంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ వ్యాఖ్యానించారు. ఆరు నెలలుగా ఆయన ప్రవర్తనలో వచ్చిన మార్పుల వల్లే బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గవర్నర్ పదవి రాలేదన్న అక్కసుతో తెలంగాణలో పార్టీని బలహీనపర్చాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ముందు మోకరిల్లి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ‘నేరేళ్ల ఘటన, మంద కృష్ణ మాదిగను అరెస్టు చేసినపుడు రాష్ట్రంలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కన్నీరు కార్చారు. కేసీఆర్‌ది దుర్మార్గ, నియంతృత్వ పాలనగా అభివర్ణించారు. ఇప్పుడు హఠాత్తుగా కేసీఆర్‌ను ఎన్టీఆర్‌కు ప్రతిరూపమని వ్యాఖ్యానించడం మోత్కుపల్లి నిజస్వరూపాన్ని బయటపెట్టిందని రమణ అన్నారు. తనకు రాజ్యసభ, గవర్నర్ పదవులు ఇస్తానని తీరా వాటిని రూ.వంద కోట్లకు అమ్ముకున్నారంటూ మోత్కుపల్లి ఆరోపించారు. ఎన్టీఆర్ ఆత్మ శాంతించాలంటే ఏపీలో చంద్రబాబును ఓడించాలని, అవసరమైతే తాను ఆంధ్రాలో రథయాత్ర చేస్తానని పేర్కొన్నారు. ఆ తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలో తన స్వగ్రామమైన పారుపల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్న తనకు బాబు గవర్నర్, రాజ్యసభ పదవి ఇస్తానని ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదవర్గాలకు పదవులు ఇవ్వడం, ఎస్సీ వర్గీకరణ శాసనసభలో తీర్మానం చేసి పంపడం గొప్ప విషయమన్నారు. తన రాజకీయ భవిష్యత్‌ను కాలమే నిర్ణయిస్తుందని మోత్కుపల్లి అన్నారు. అయితే ఆయన ఆరాటం టిఆర్ఎస్లో ఏరి రాజకీయ ఉపాధి పొందడమే ముఖ్యమని అందరికీ తెలుసు.




