– భాజపా నేతపై ట్విట్టర్‌లో మంచు విష్ణు ఆగ్రహం
హైదరాబాద్,అక్టోబర్23(జనంసాక్షి): సినిమా స్టార్లకు జీకే ఉండదు అనుకుంటే.. మరి రాజకీయ
నాయకులంతా అవినీతి పరులా..? అంటూ భాజపా అధికార ప్రతిధి జీవీఎల్ నరసింహారావుపై నటుడు మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ నటుడు విజయ్ నటించిన ‘మెర్సల్’ చిత్రంలో వస్తు, సేవల పన్ను గురించి తప్పుగా చూపించారంటూ కొంతకాలంగా భాజపా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ విషయమై నరసింహారావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అందులో ఆయన మాట్లాడుతూ సినీ నటులపై తప్పుడు వ్యాఖ్యలు చేశారు. చాలా మంది భారతీయ నటులకి విషయ పరిజ్ఞానం ఉండదని వ్యాఖ్యానించారు. దాంతో ఆయన వ్యాఖ్యలు చిత్రపరిశ్రమలో దుమారం రేపాయి. దీనిపై మంచు విష్ణు ట్విటర్ ద్వారా స్పందిస్తూ నరసింహారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా స్టార్లకు జీకే ఉండదు అనుకుంటే.. మరి రాజకీయ నాయకులంతా అవినీతి పరులా? మన దేశానికి చెందిన గొప్ప నటులే గొప్ప రాజకీయవేత్తలు అయ్యారన్న విషయం మరువద్దు. వారిలో నందమూరి తారక రామారావు, ఎంజీఆర్, జయలలిత ఉన్నారు. ఒకరి అభిప్రాయం చెప్పడానికి జీకే ఉండాల్సిన అవసరం లేదు. నేను భారతీయుడిని. క్రిస్టియన్‌ని వివాహం చేసుకున్నాను. అయినప్పటికీ హిందుత్వాన్ని బాగా నమ్ముతాను. హిందువునని చెప్పుకోవడానికి గర్వపడతాను. నాకు భాజపాపై గౌరవం ఉంది. ప్రధాని నరేంద్రమోదీకి అభిమానిని.’ అని విష్ణు పేర్కొన్నారు. నరసింహారావు వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ కూడా స్పందించారు. ఇలాంటి మాటలు మాట్లాడటానికి విూకెంత ధైర్యం అంటూ మండిపడ్డారు.




