– రాజ్య సభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పిలుపు
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) స్వాతంత్రం నాటి నుండి నేటివరకు రాజ్యాధికారంలో ఉన్న అగ్రవర్ణాలు బీసీలను మోసం చేస్తూనే ఉన్నాయని, బీసీలు అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నారని, బీసీలు ఏకమై రాజ్యాధికారం దిశగా ఉద్యమాలు చేపట్టి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. హైదరాబాద్, ఎల్.బి నగర్, భాగ్య నగర్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర బీసీ హక్కుల సాధన సమితి 3 వ రాష్ట్ర మహాసభలను ఆర్. కృష్ణయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. తొలుత ఇండియన్ అసోసియేషన్ అఫ్ లాయర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీసీ హక్కుల సాధన సమితి గౌరవ సలహాదారు బొమ్మగాని ప్రభాకర్ సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ మహాసభకు బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర నేతలు ధనంజయ నాయుడు, ప్రమీల, సుంకరి సత్తయ్య లు అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి రాయబండి పాండురంగ చారి స్వాగతం పలికారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి గౌరవ అతిథిగా, ఇండియన్ అసోసియేషన్ అఫ్ లాయర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీసీ హక్కుల సాధన సమితి సలహాదారు బొమ్మగాని ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్. బాలమల్లేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి, వృత్తి సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపాముల వెంకట్రాములు, రాష్ట్ర బీసీ కాంట్రాక్టర్లు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సక్కురి భాస్కర్ రావు, జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, రాష్ట్ర నాయకులూ కోలా జనార్దన్ లు వేదికపై ఆసీనులైనారు. ఈ సందర్బంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బీసీ వ్యతరేక శక్తులు గా పని చేస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీల కులగణన చేయకుండా విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రేజర్వేషన్ల ఫలాలను దేశంలోని 60 శతం మంది బీసీలకు దక్కకుండా చేస్తుందని అయన మండిపడ్డారు. ఓబీసీల కులగణన చేయకుండా జాప్యం చేయడం వల్ల విద్యార్థులు, నిరుద్యోగ యువత తీవ్రంగా నష్ట పోతున్నారని అయన ఆవేదన వ్యక్తం చేసారు. డెబ్బై కోట్లకు పైగా ఉన్న బీసీల సంక్షేమం కోసం కనీసం ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయకపోవడం బాధాకరం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్దించి ఎనమిది సంవత్సరాలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు మోసపూరిత వాగ్దానాలు చేస్తూ కాలం వెల్లడిస్తుందని, కెసిఆర్ ప్రభుత్వం బీసీలను బిచ్చగాళ్ల మాదిరి చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎనమిది ఏళ్ళ కాలంలో ఇప్పటివరకు బీసీ కార్పొరేషన్ నుండి రుణాలు ఇవ్వలేదని, బీసీ హాస్టల్ లలో అరకొర సౌకర్యాలు మరియు నూతన హాస్టల్ ల పెంపులేదని, బీసీ విద్యార్థులకు స్కాలర్ షిప్స్, ఫీజు రేయింబర్సుమెంట్ ఇవ్వడంలేదని అయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు బీసీల సామాజిక, రాజకీయ, ఆర్థిక అభ్యున్నతికి టిఆర్ఎస్ ఏం చేససిందని అయన ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను విస్మరించి, అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని, చట్ట సభల్లో బీసీలకు 50 % రేజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అయన విమర్శించారు. హక్కుల సాధనకై దేశవ్యాప్తంగా బీసీలను చైతన్యపరచవలసిన అవసరం ఉందని, బీసీలందరు రాజ్యాధికారం కోసం ఏకమై బలమైన ఉద్యమాలు నిర్మిస్తేనే తమ సమస్యలు పరిష్కరామౌతాయని ఆర్. కృష్ణయ్య తెలిపారు. పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ బీసీలు ఆర్థిక అసమానతల నుండి బయటపడడానికి, వారి హక్కుల కోసం సిపిఐ అనేక పోరాటాలు నిర్వహించిందని గుర్తు చేసారు. బీసీల ఆర్థిక, సామాజికాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడానికి వామపక్షాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెడచెవిన పెడుతుందన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా సామాజిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. నేటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో బీసీ కులాల సమస్యల పరిష్కరానికి మరియు బీసీ కుల వృత్తిదారుల సమస్యలపై పోరాటాలకు సిపిఐ మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని అయన తెలిపారు. బీసీలందరు ఏకమై పటిష్ఠమైన బీసీ ఉద్యమ నిర్మాణం జరిగినప్పుడే వారి సమస్యలు పరిస్కారం అవుతాయని పల్లా వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ స్వాతంత్రం సిద్దించి 75 సంవత్సరాలు కావస్తున్నా నేటికీ బీసీ,ఎస్.సి, ఎస్.టి, మైనారిటీలు ఆర్థిక స్వాతంత్రం, సామజిక న్యాయం పొందడంలో ఇంకా వెనుకబడే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసారు. గతంలో మండల్ కమిషన్ సిఫార్సుల అమలు కోసం, బీసీ హక్కుల సాధనకై సమష్ఠిగా నిర్వహించిన పోరాటాలు స్ఫూర్తిదాయకం అని అన్నారు. నేటి యువత రాజ్యాంగంలో పొందుపరచిన హక్కుల కోసం చైతన్యంగా ఉద్యమాలు నిర్మిస్తూ ముందుకు సాగాలని బొమ్మగాని ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ మహాసభలో అన్ని జిల్లా ప్రతినిధులతోపాటు తెలంగాణ రాష్ట్ర బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర నాయకులూ కలకొండ కాంతయ్య, ప్రవీణ్ కుమార్ గౌడ్ బొడ్డుపల్లి కృష్ణ, డిటి నరసయ్య, సాయి, బతరాజు నరసింహ తదితరులు పాల్గొన్నారు.




