Tuesday, 3 November 2026

రాధేశ్యామ్‌కు రాజమౌళి వాయిస్‌

ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ’రాధేశ్యామ్‌’ కోసం ప్రేక్షకులు ముఖ్యంగా ప్రభాస్‌ అభిమానులు అతృతగా ఎదురుచూస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనితో చిత్ర బృందం ప్రమోషన్స్‌ మొదలు పెట్టింది. సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. తాజాగా మరో ఆసక్తికర వార్త బయటికొచ్చింది. హిందీ వెర్షన్‌కి అమితాబ్‌ బచ్చన్‌తో వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారని ఇటీవల నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే తెలుగు వెర్షన్‌కి రాజమౌళితో వాయిస్‌ ఓవర్‌ ఇప్పించారు. సినిమా కథని రాజమౌళి పరిచయం చేయబోతున్నారు. ఇప్పటికే ఆయన వాయిస్‌ ఇచ్చారని తెలిసింది. జక్కన్న, ప్రభాస్‌కి మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ’రాధేశ్యామ్‌’ ప్రమోషన్లలో తన వంతు సాయం చేస్తున్నారు రాజమౌళి. అలాగే ఈ చిత్రం కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదలవు తుంది. ఆయా భాషల స్టార్‌ హీరోలు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వబోతున్నారట. త్వరలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించనున్నారు.