Thursday, 5 November 2026

రికార్డు సృష్టించిన జూలపల్లి గ్రామపంచాయతీ..! – కేంద్రం ప్రకటించిన 9 కేటగిరీలో తొమ్మిదింటికి ఎంపిక

 జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామపంచాయతీ రికార్డ్ సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం తొమ్మిది కేటగిరీల్లో ఉత్తమ గ్రామ పంచాయతీలను మండలాల వారీగా ఎంపిక చేయగా కమాన్పూర్ మండలం నుంచి జూలపల్లి గ్రామపంచాయతీ 9 కి 9 విభాగాల్లో ఎంపికై ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలిచి రికార్డు సృష్టించింది. జూలపల్లి గ్రామపంచాయతీని ఇప్పటికే నేషనల్ పంచాయతీ అవార్డుకు సైతం జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు కేంద్రానికి పంపడం జరిగింది. అన్ని విభాగాలలో జూలపల్లి పంచాయతీ ముందంజలో ఉండడం, జూలపల్లి సర్పంచ్ బొల్లపల్లి శంకర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి వెంకటరమణరెడ్డి పనితీరు గుర్తించి ఈ నెల 25న పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, మంత్రి చేతుల మీదుగా వారికి ప్రశంస పత్రాలు అందజేసి సన్మానించ నున్నారు. కేంద్రం ప్రకటించిన అన్ని విభాగాలు జూలపల్లి జిపి చోటు దక్కించుకోవడం పట్ల జూలపల్లి గ్రామపంచాయతీలో గురువారం సర్పంచ్ శంకర్ గౌడ్ తో పాటు సెక్రెటరీ వెంకటరమణారెడ్డి లను కమాన్పూర్ మండల ఎంపీడీవో విజయకుమార్ , ఎంపిఓ శేషయ్య సూరి, పంచాయతీ కార్యదర్శి వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీ శివ శంకరయ్య, గ్రామపంచాయతీ కరోబార్ ,సిబ్బంది, ఏఎన్ఎం, డాక్టర్ సాహితి, ఆశ కార్యకర్తలు శాలువాలు కప్పి స్వీట్ తినిపించి అభినందనలు తెలియజేశారు. అలాగే సిద్ది పల్లె గ్రామపంచాయతీ 9 విభాగాల్లో 7 విభాగాల్లో చోటు దక్కించుకొని రెండో స్థానంలో నిలువగా రొంపికుంట గ్రామపంచాయతీ 6 విభాగాల్లో చోటు దక్కించుకొని మూడో స్థానంలో నిలిచింది.