29 డ్యాముల పునరుద్ధరణపై జలసంఘానికి ప్రభుత్వం ప్రతిపాదనలు
హైదరాబాద్,సెప్టెంబర్1(జనంసాక్షి): తెలంగాణలోని 29 డ్యాముల పునరుద్ధరణకు రూ. 645 కోట్ల ఆర్ధిక సహాయం అందించాలంటూ కేంద్ర జల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కేంద్ర జలసంఘంఈ ప్రతిపాదనలు ప్రపంచ బ్యాంకు పంపనుంది. డ్యామ్ రిహాబులిటీషన్ ఇంప్రూవ్ మెంట్ ప్రాజెక్టు (డ్రిప్ -2) కింద ప్రపంచ బ్యాంకు నిధులు ఇవ్వనుంది. మంత్రి హరీశ్ రావు చొరవతో, సెంట్రల్ డిజైన్స్ సి.ఈ. ఎ. నరేందర్ రెడ్డి బృందం ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రతిపాదనల నివేదికను సి.ఈ.సి.డి.ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు శ్రీనివాస్ ఢిల్లీ లో కేంద్ర జలసంఘంలోని డ్రిప్ డివిజన్ డైరెక్టర్ ప్రమోద్ నారాయణ్ కు అందజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల కానున్నాయి. ప్రాజెక్టుల నిర్వహణ, డ్యామ్ ల రక్షణ, భద్రతపై గత నెలలో మంత్రి హరీశ్ రావు విస్తృతంగా చర్చించిన సంగతి తెలిసిందే. డ్యామ్ సేప్టీ ,తదితర అంశాలపై సెంట్రల్ డిజైన్స్ సి.ఈ. నరేందర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చారు. డ్రిప్-2 కింద ప్రపంచ బ్యాంకు వివిధ రాష్టాల్రలోని డ్యాములకు నిధులను అందజేస్తుంది. ఈ నిధులతో డ్యాముల పటిష్టత, పాత డ్యాముల పునరుద్ధరణ, ఇతర మరమ్మతులు చేపట్టనున్నారు.




