Wednesday, 4 November 2026

రేపు ఎన్నికలొచ్చినా…

ఎదుర్కొనేందుకు సిద్ధమే
– తెరాసను వదిలించుకొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
– ఫెడరల్‌ ఫ్రంట్‌ ఎటుపోయిందో చెప్పాలి
– కేంద్ర ప్రభుత్వ విధానాలు దారుణంగా ఉన్నాయి
– విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత జైపాల్‌రెడ్డి
హైదరాబాద్‌, జూన్‌26(జ‌నం సాక్షి) : ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సన్నద్ధంగా ఉందని, రేపు ఎన్నికలు నిర్వహిస్తానని సీఎం కేసీఆర్‌ అన్నా అందుకు తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విూడియాతో మాట్లాడారు. ప్రజలు కూడా ఎన్నికల కోసమే ఎదురు చూస్తున్నారని, ప్రజా వ్యతిరే విధానాలను కొనసాగించే తెరాస ప్రభుత్వాన్ని వదిలించుకొనేందుకు ఎదురు చూస్తున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలు దారుణంగా ఉన్నాయన్న జైపాల్‌రెడ్డి.. ఆ పార్టీలో చదువుకున్న నేతలు లేరన్నారు. పేదల బాగోగుల గురించి ఆలోచించరని, మతాంతర వివాహం చేసుకున్న జంటను పాస్‌ పోర్ట్‌ విషయంలో అష్టకష్టాలకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్‌ పోర్ట్‌ రీ వెరిఫికేషన్‌ పేరిట వివక్ష ప్రదర్శించారని, మోదీ అనుచరులు, స్మృతి ఇరానీ(కేంద్ర మంత్రి) అనుచరులు ఆ జంటను పత్రికల్లో రాయలేని పదజాలంతో సోషల్‌ విూడియాలో విమర్శలు గుప్పించారన్నారు. ఇలాంటి వాళ్లు నియంత మనస్తత్వం కలిగి ఉంటారని
విమర్శించారు. అల్ప సంఖ్యాక వర్గాలను అణగదొక్కేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని, సామాజిక మాధ్యమాల్లో దూషణలకు దిగేవారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోందని జైపాల్‌రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా పెట్రోలియం రేట్లు  పెరిగిపోతున్నాయని, టాక్స్‌ను కూడా ప్రభుత్వం తగ్గించలేకపోతోందని విమర్శించారు. ‘పెట్రోల్‌ టాక్స్‌ల ద్వారా ద్రవ్య లోటు పూడ్చాలని ఈ ప్రభుత్వం యత్నిస్తోందని, కానీ పెట్రోల్‌ రేట్లు పెరిగితే అన్ని వస్తువులపై ధరలు పెరుగుతాయని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి అని ఆయన అన్నారు. కేసీఆర్‌ తనకు తానే తెలివైనోడిని అనుకుంటున్నాడు. అందరినీ మోసం చేయగలను భావిస్తున్నాడన్నారు. ఓవైపు మోదీతో దోస్తాన్‌ చేస్తున్నాడు. మరోవైపు ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ హడావుడి చేస్తున్నాడని విమర్శించారు. ఇప్పుడా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఎక్కడుందో కేసీఆర్‌ చెప్పాలని జైపాల్‌రెడ్డి నిలదీశారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ చాలా బలహీనంగా ఉందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.