విశాఖలోనూ మరో స్టీల్ ప్లాంట్
– శంకుస్థాపన చేసేందుకు ప్రధాని వస్తారు
– ఇది తెలిసే క్రెడిట్ పొందేందుకు తెదేపా నేతలు దీక్షకు దిగారు
– 2014 లో సెయిల్ ఇచ్చిన నివేదికలో ప్లాంట్ సాధ్యం కాదని చెప్పింది
– టీడీపీ నేతలు అప్పుడెందుకు ధర్నాలు, ఆందోళనలు చేయలేదు?
– విలేకరుల సమావేశంలో బీజేపీ నేత కందుల రాజమోహన్‌రెడ్డి
న్యూఢిల్లీ, జూన్26(జనం సాక్షి) : స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ విషయంలో టీడీపీ నేతలు దుష్పచ్రారం చేస్తున్నారని బీజేపీ నేత కందుల రాజమోహన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ… 2014లో సెయిల్ ఇచ్చిన నివేదికలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని చెప్పిన విషయాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నారని వెల్లడించారు. చివరి పేరాలో ప్రస్తావించిన ‘ మెకాన్ సంస్థ ప్రాథమిక నివేదిక’ గురించి ఉద్దేశపూర్వకంగా వదలేశారని ఆయన తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధప్రదేశ్‌కు కేవలం కడపలోనే కాదు, విశాఖలోనూ మరో స్టీల్ ప్లాంట్ ఇవ్వనుందని ఆయన వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఒత్తిడి ఉన్నా సరే విశాఖలో స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు కేంద్రం సిద్దపడిందని ఆయన అన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ శంఖుస్థాపనకు ప్రధాని మోడీ వస్తున్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ విషయం తెలుసు కాబట్టే టీడీపీ నేతలు స్టీల్ ప్లాంట్ కోసం ‘దీక్షల పేరుతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని రాజమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీకి చిత్తశుద్ధి ఉన్నట్టయితే 2014లో సెయిల్ నివేదిక స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదన్నప్పుడే ఎందుకు ధర్నాలు, దీక్షలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో ఇనుప ఖనిజం గనుల్ని విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఒప్పందం చేయించిన రాష్ట్ర ప్రభుత్వానికి, కడప స్టీల్ ప్లాంట్ అప్పుడు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. కడపలో తమకు ఓట్లు వేయనప్పుడు ఎందుకు అభివృద్ధి చేయాలని ఒకసారి సీఎం చంద్రబాబే స్వయంగా వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. కడప జిల్లాలో అభివృద్ధి పనులు చేయకుండా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వమేనని ఆయన అన్నారు. సీఎం రమేశ్ సహా టీడీపీ నేతల దీక్షల్లో ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. పార్లమెంటులో 6 గంటలకే స్పృహ కోల్పోయిన నేతలు 6 రోజులుగా ఇప్పుడు ఎలా దీక్ష చేయగల్గుతున్నారని ప్రశ్నించారు. దీన్ని బట్టే వారి దీక్షల్లో స్వచ్ఛత ఎంత ఉందనేది అర్థమవుతోందని వెల్లడించారు. ఫుడ్ కమిటీ, అకామడేషన్ కమిటీ, వాటర్ కమిటీలు వేసుకుని చేస్తున్న ఈ దీక్షలు కార్పొరేట్ దీక్షలను తలపిస్తున్నాయని కందుల రాజమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.




