Tuesday, 3 November 2026

రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై నోటీసులు

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ గుర్తుపై గెలుపొందిన ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్ లేజిస్లేచర్ పార్టీలో వీలినం చేస్తున్నట్లుగా రాసిన లేఖ ఆధారంగా బులెటిన్ జారీచేయడంపై రాష్ట్ర శాసనసభ స్పీకర్ ఎస్ మధుసూదనాచారికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. టీఆర్‌ఎస్ లేజిస్లేచర్ పార్టీలో టీటీడీపీ పార్టీని విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.

ఈ సందర్భంగా రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్‌తోపాటు ప్రతివాదులుగా పేర్కొన్న అసెంబ్లీ కార్యదర్శి, టీఆర్‌ఎస్‌లో టీటీడీపీ పార్టీని విలీనం కోసం స్పీకర్‌కు లేఖ రాసిన 12 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసింది.టీటీడీపీ పార్టీని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేస్తూ ఈ ఏడాది మార్చి 10 వ తేదీన అసెంబ్లీ కార్యదర్శి పేరిట జారీచేసిన బులెటిన్ సంఖ్య 5ను రద్దు చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషన్‌పై స్పందించిన జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఆధ్వర్యంలోని ధర్మాసనం రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రతివాదులకు నోటీసులు (నోటీస్ బిఫోర్ అడ్మిషన్) జారీచేసింది.

1535

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *