హైదరాబాద్,జూన్27(జనం సాక్షి): రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా పకడ్బందీగా ఏర్పాట్లను ప్రభుత్వం రూపొందించింది. సబ్సిడీ బియ్యం పక్కదారి పట్టకుండా ఆధార్ అనుసంధానం తో పాటు సీసీ కెమెరాలను, బయోమెట్రిక్ విధానం అములు చేయనున్నారు. కొందరు అధికారులు, రేషన్‌డీలర్లు పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు ప్రభుత్వ సర్వేల్లో తేలింది. మొత్తం సరుకులను డీలర్లు మిగులు చూపకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. . వాస్తవానికి ప్రతి రెవెన్యూ అధికారులు రేషన్ దుఖానాలను సందర్శించి మిగిలిన సరుకులు నిలువ ఉన్నాయో లేదో వాటిని పరిశీలించి మిగిలిన సరుకులు వచ్చే నెలకు కేటాయింపు చేయాల్సి ఉంటుంది. కానీ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో సబ్సిడీ బియ్యం పక్కదారి పడుతోంది. రూపాయి కిలో బియ్యం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వంప్రవేశపెట్టి కోట్లాది నిధులను ఖర్చు చేస్తోంది. జిల్లాలో రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానంతో పాటు స్టాక్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలను, ఆధార్ అనుసంధానం విధానాన్ని అమలు చేస్తే 30 శాతం వరకు రేషన్ సరుకులు ఆదా అయ్యే అవకాశముంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడంతో రేషన్‌కార్డులు గల లబ్ధిదారులకు ఎవరో ఒక్కరు వచ్చి వేలుముద్రలువేసి సరుకులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గడువులోపు ఎంతమంది వినియోగదారులు దుకాణాలకు వచ్చి సరుకులను తీసుకొని వెళ్లారో రికార్డవుతుంది. అధార్అనుసంధానికి ప్రభుత్వం జూన్ 30 వరకు అవకాశం కల్పించగా ముందుగానే జిల్లాలో 100 శాతం ఆహారభద్రత కార్డులు అనుసంధానం చేశారు. దీంతో రేషన్ అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది.




