హైదరాబాద్,మే9(జనం సాక్షి): ఈ నెల 10 నుంచి రైతుబంధు పథకం ప్రారంభంకానున్న నేపథ్యంలో పలువురు వ్యవసారంగ ప్రముఖులు పథకాన్ని అభినందించారు. ఇది రైతులను ఆదుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. రైతుకు సకాలంలో విత్తనాలు, ఎరువులు, సాగునీరు అందిస్తే అద్భుతమైన దిగుబడులు వస్తాయి. వచ్చిన పంటను దాచుకుని మంచిధర వచ్చినప్పుడు అమ్ముకుంటే రైతు కష్టానికి తగిన ఫలితం వస్తుందన్నారు. సిఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సమగ్రంగా అన్నింటిపైనా చర్యలు తీసుకుంటూ రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని సుస్థిరం చేసేదిశగా ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించారని తెలిపారు. వరి సాగుకు ఎకరానికి రూ.2500, మెట్టపంటలకు రూ.1500 వరకు విత్తనాలు, ఎరువులకు ఖర్చు అవుతుంది. మిగిలిన డబ్బులను పంటకలుపు, పురుగుమందుల కొనుగోలుకు ఉపయోగిస్తే.. రైతులు నష్టాలపాలు కాకుండా బయటపడవచ్చన్నారు. వ్యవసాయాన్ని గాడిలో పెట్టడానికి సీఎం కేసీఆర్ భారీ ప్రణాళికలను రూపొందించారు. ఇక్కడి వ్యవసాయం, నీటియాజమాన్యం బోరుబావులపై ఆధారపడిన విషయాన్ని గుర్తించి 24 గంటల ఉచిత విద్యుత్ అందించారు. పంటల నిల్వ కోసం 21 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న గిడ్డంగులను ఏర్పాటుచేశారు. మండలస్థాయిలో గిడ్డంగుల సదుపాయం మెరుగుపడింది. విత్తనాలు నిల్వ చేసుకునే సామర్థ్యం మెరుగైంది. దీంతో పండించిన పంటను సరైన గిట్టుబాటు ధర వచ్చినప్పడు అమ్ముకునే అవకాశాలు పెరిగాయి. వ్యవసాయానికి రవాణా కనెక్టివిటీ అవసరం. ప్రతి గ్రామానికి రోడ్డు వసతి పెరిగింది. మౌలిక సదుపాయాలను ప్రభుత్వం పెద్దఎత్తున కల్పించింది. రాష్ట్రంలో విద్యుత్, సాగునీరు, గిడ్డంగులు, మార్కెటింగ్, ఈ-నామ్, గిట్టుబాటుధర వంటి సౌకర్యాలు మెరుగయ్యాయి. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినప్పుడే ఉత్తమ ఫలితాలు లభిస్తాయన్నారు. ఈ పథకం వల్ల రైతులకు వ్యవసాయపరంగా భరోసా దక్కనుందన్నారు.




