గత విధానాలకు పాతరతో సాగులో చైతన్యం
ఆదిలాబాద్,జూలై17(జనం సాక్షి): జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో రెండు లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసిన అధికారులు అందుకు అనగుఉణంగా విత్తనాలు, ఎరువులను పంపిణీ చేశారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పంపిణీ చేశారు. అధికారులు తీసుకుంటున్న చర్యల కారణంగా రైతులకు సకాలంలో విత్తనాలు చేరి వానలు పడినప్పుడు సరైన సమయంలో విత్తనాలు నాటే అవకాశం లభించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా వివిధ పంటలు ప్రస్తుతం మంచి ఎదుగుదల దశలో ఉన్నాయి. జిల్లాలో వానాకాలం పంటలు సాగుచేసే రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులను వ్యవసాయశాఖ అధికారులు సీజన్‌కు ముందుగానే అందుబాటులో ఉంచారు. గత ప్రభుత్వాల పాలనలో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడేవారు. రోడ్డెక్కి ఆందోళన చేయనిదే రైతుకు విత్తనాలు, ఎరువులు దొరికేవి కావు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పలు పథకాలను అమలు చేస్తోంది. గతంలో ఏటా ఈ సీజన్లో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. జూన్ నెల ప్రారంభంలో వర్షాలు కురువడంతో విత్తనాలు వేసేవారు. తర్వాత వరుణుడు ముఖం చాటేయడం, ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో భూమిలో నాటిన విత్తనాలు మాడిపోయి మొలకెత్తివి కాదు. దీంతో రైతులు రెండు, మూడు దఫాలుగా విత్తనాలు వేసేవారు. ఈ సంవత్సరం ఒకేసారి వేసిన విత్తనాలు మొలకెత్తడంతో రైతులకు అదనపు భారం తప్పింది.జిల్లాలోని రైతులకు వానాకాలం సీజన్ చాలా ప్రాధాన్యమైంది. జిల్లా వ్యాప్తంగా సాగునీటి వనరులు అంతంత మాత్రంగానే ఉండడంతో రైతులు వర్షాలపై ఆధారపడతారు. ఈ సీజన్లోనే ప్రధానమైన పంటలు వేస్తారు. అధికంగా నల్లరేగడి భూములు ఉండగా సీజన్ ప్రారంభానికి నెల రోజుల ముందు నుంచి భూములను సాగుకు సిద్ధం చేస్తారు. జిల్లాలో ఎక్కువగా పత్తి, సోయాబీన్, కంది, పెసర, మినుము పంటలు ఎక్కువగా సాగువుతుండగా వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందజేశారు. సహకార సంఘాల ద్వారా సబ్సిడీ విత్తనాలు, ఎరువులను పంపిణీ చేశారు. విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు మళ్లకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు,వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాల దుకాణా ల్లో తనిఖీలు ని ర్వహిస్తూ నకిలీ విత్తనాలను విక్రయించ కుండా చర్యలు తీసుకున్నారు. కొన్నిరోజులుగా కురుస్తోన్న వానలతో రైతాంగం ఊపిరిపీల్చుకుంది. సీజన్ ప్రారంభంలోనే వేసిన విత్తనాలు మొలకెత్తి ఏపుగా పెరుగుతుండడంతో రైతుల కన్నుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.




