హైదరాబాద్ : రైతు రుణమాఫీపై ఈ నెల 9వతేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధిస్తున్నామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ఈనెల 9వతేదీ లోపు ఒకటేసారి రుణమాపీ చేస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేయాలని, లేకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో నుంచి అడుగు కూడా బయటపెట్టలేరని ఆయన హెచ్చరించారు. రుణమాఫీ మొత్తం ఒకటేసారి చేయడం వల్ల ప్రభుత్వానికి వస్తున్న ఇబ్బందులేమిటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఆ హామీని విస్మరించారన్నారు. రోజురోజుకూ రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.




