అడ్డగుట్ట: సికింద్రాబాద్ రైల్వే పోలీసుల అదుపులో ఉన్న మహారాష్ట్రకు చెందిన నలుగురు అంతర్రాష్ట్ర మహిళా దొంగలు మహిళా కానిస్టేబుల్ కళ్లుగప్పి పరారయ్యారు. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. ఈనెల 11వ తేదీ ఉదయం 6.45 గంటలకు జగద్గిరిగుట్టకు చెందిన మంగమ్మ మహబూబ్‌నగర్ వెళ్లేందుకు ఇద్దరు పిల్లలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. రెండో ప్లాట్‌ఫాంపై ఉన్న రైలు ఎక్కేందుకు ఒకటో ఫ్లాట్‌ఫాంపై ఉన్న ఎస్కలేటర్‌లో వెళుతుండగా నలుగురు మహిళలు ఆమె బాగులో ఉన్న 50 వేలు అపహరించి పారిపోయిన విషయం విదితమే. ఎస్కలేటర్ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా చోరీ చేసింది మహిళలని… వారు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. ఈనెల 12న రైల్వే రక్షణ దళం పోలీసులు పట్టుకొని సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు అప్పగించారు. వారిని ప్రశ్నించేందుకు ఆరు రోజులుగా స్టేషన్‌లో ఉంచారు. సోమవారం రాత్రి జీఆర్‌పీ స్టేషన్‌లో ఎస్‌ఐ గదిలో పడుకున్న వారికి మహిళా కానిస్టేబుల్ బందోబస్తుగా ఉన్నారు. మంగళవారం తెల్లవారు జామున కానిస్టేబుల్ గాఢనిద్రలో ఉండగా పసిగట్టిన ఆ నలుగురూ తప్పించుకుని పారిపోయారు. వారు కనిపించకపోవడంతో పోలీసులు అప్ర మత్తమయ్యారు. పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఈ విషయమై సబ్ ఇన్‌స్పెక్టర్ మహేష్‌కుమార్‌ను వివరణ కోరగా… నేను డ్యూటీలో లేనని… నాకు తెలియదని చెప్పారు. పరారీలో ఉన్న అంతర్రాష్ట్ర మహిళా దొంగల కోసం రైల్వే పోలీసులు వేట ప్రారంభించారు. ఇరవై నాలుగు గంటల్లో వారిని పట్టుకుంటామని చెప్పారు.




