Wednesday, 4 November 2026

వానాకాలం సీజన్‌లో పెరగనున్న సాగు విస్తీర్ణం

పెట్టుబడి సాయంతో రైతుల్లో ఉత్సాహం
వ్యవసాయ శాఖ అంచనా
హైదరాబాద్‌,మే29(జ‌నం సాక్షి): వానాకాలం సీజన్‌ కోసం అవసరమైన ఎరువుల, విత్తనాలు సిద్దం చేశామని, ఇప్పటికే జిల్లాల వారీగా పంపిణీ చేశామని వ్యవసాయ శాఖ ప్రకటించింది. మరోవైపు రైతుబంధు పథకం కింద ప్రభుత్వం రైతులకు ఎకరానికి 4 వేల చొప్పున అందిస్తున్న నేపథ్యంలో వానకాలం సీజన్‌లో పంటల సాగువిస్తీర్ణం గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో 18.80 లక్షల టన్నుల ఎరువులు, 7.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉంటుందని వ్యవసాయశాఖవర్గాలు అంచనావేశాయి. వానకాలం సీజన్‌లో 7.50 లక్షలు, యాసంగిలో 4.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు అందించేందుకు వ్యవసాయశాఖ ప్రణాళికలు సిద్ధంచేసింది. జిల్లాల్లో మొదటి విడుతగా 5 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచింది. దాదాపు 1.15 కోట్ల ఎకరాలు సాగులోకి వస్తుందని ప్రాథమికంగా అంచనావేసిన అధికారులు అందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్రానికి పంపించారు. దానిప్రకారం ఎరువులను పంపిణీ చేయాలని కేంద్రాన్ని కోరగా ఆ మేరకు ఆమోదం తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామగ్రామాన ఇప్పుడు అన్నదాతలంతా ఖరీఫ్‌ కోసం కదం తొక్కుతున్నారు. ప్రభుత్వం రైతుబంధు కింద సాయం చేయడంతో ఉత్సాహంగా సాగుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం అందుబాటులో ఉంచిన ఎరువులు, విత్తనాలు కొనేందుకు సిద్దమవుతున్నారు. చినుకు పడిన వెంటనే వ్యవసాయం చేసుకునేలా  రెడీ అవుతున్నారు. రానున్న వానకాలం సీజన్‌కు అవసరమైన విత్తనాలు, ఎరువుల సరఫరా కోసం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక గత వానకాలం సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16.2 లక్షల టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనావేయగా.. 17.37 లక్షల టన్ను లు సరఫరా చేసింది. అధికారులు రూపొందించిన అంచనాలకు మించి రైతులు యూరియా, కాంప్లెక్స్‌ ఎరువులను వినియోగించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ సీజన్‌లో 8.50 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా, 2
లక్షల టన్నుల డీఏపీ, 5.50 లక్షల టన్నుల కాంప్లెక్స్‌, 1.50 లక్షల టన్నుల ఎంఓపీ ఎరువులు అవసరమని అంచనా వేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తరువాత అత్యధికంగా ఎరువులు కావాలని కోరిన రెండో రాష్ట్రం తెలంగాణాయే కావడం విశేషం. వానకాలం సీజన్‌లో సోయాబీన్‌, వేరుశనగ, శనగ, వరి, రాగి, కందులు, పెసర్లు, మినుములు, జొన్న, మొక్కజొన్న, ఆముదం, పొద్దుతిరుగుడు, పిల్లిపెసర వంటి విత్తనాలను సబ్సిడీపై సరఫరాచేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది.