మత్స్య సంఘాలకు భారీగా లాభాలు
ప్రభుత్వ ప్రోత్సాహంతో పెరిగిన ఆదాయం
హైదరాబాద్,మే29(జనం సాక్షి): మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్దరణ జరిగి, చెరువుల్లో నీరు చేరడం, ప్రభుత్వం ఉచితంగా చేప విత్తనాలు సరఫరా చేయడంతో మతస్యకారులకు ఆదాయం వస్తోందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇటీవల ఆయా చెరువుల ద్వారా గతంలో ఎప్పుడూ లేనంతగా చేపల ఉత్పత్తిని గుర్తించారు. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థలో మత్స్యకారుల ఇండ్లలో సిరులు పండుతున్నాయి. చెరువులు, రిజర్వాయర్లు, కుంటలు, ప్రాజెక్టుల ప్రాంతాల్లో ఉచితంగా కోట్ల చేపపిల్లల పంపిణీతో అనూహ్యమైన మార్పు కనిపిస్తున్నది. ప్రతి జిల్లాలో టన్నుల కొద్దీ చేపలు.. కోట్ల రూపాయల ఆదాయం లభిస్తున్నది. గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించిన మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వ చర్యలు మేమున్నామంటూ పూర్తి భరోసాను కల్పిస్తున్నాయి. వివిధ జిల్లాల్లో మత్స్య సంఘాలు అందించిన విరాల మేరకు భారీగా చేపల దిగుబడి పెరిగింది. ఇదంతా ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం వల్లనే అని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠానాకాలాన్ అలీసాగర్ చెరువులో, ముప్కాల్ మండలం రెంజర్లలో ఊర చెరువులో, నందిపేట మండలం వెల్మల్‌లోని గంగా చెరువులో కేజ్ కల్చర్ యూనిట్లు కొనసాగుతున్నాయి. సింగూరులోనూ కేజ్ కల్చర్ యూనిట్లను నిర్వహిస్తున్నారు. చేపలు పట్టుకునేందుకు వలలు, చేపలు ఇతర ప్రాంతాలకు తరలించడానికి వాహనాలు, ఇంటిగ్రేటేడ్ మత్స్య అభివృద్ది పథకం ద్వారా లబ్దిదారులకు అందిస్తున్నారు. బొచ్చ, రోహు, కట్ల, మృగాల, బంగారుతీగలను ఎంపిక చేసిన చెరువుల్లో ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసింది. చెరువులవారీగా సంఘ సభ్యులు చేపలుపట్టి హైదరాబాద్ తోపాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేసి చెరువుల్లో చేప పిల్లలను వేయడంతో సహకార సంఘాల సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 2016 లో 62 చెరువుల్లో 43 లక్షల చేప పిల్లలను వదలగా.. నిరుడు 133 చెరువుల్లో 80 లక్షల చేపల పెంపకాన్ని చేపట్టారు. జైనథ్ మండలం సాత్నాల, భీంపూర్ మండలం మత్తడి ప్రాజెక్టులతోపాటు చెరువుల్లో చేపల పెంపకం జరుగుతున్నది. రోహు, కట్ల, మృగాల చేప పిల్లల రకాలను సరఫరా చేస్తున్నారు. 1200 టన్నుల చేపలు జిల్లాలో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 1.15 కోట్ల చేప పిల్లలను పంపిణీచేశారు. వీటి ద్వారా ఉత్పత్తి అయిన 4,612 టన్నుల చేపల ద్వారా 36.89 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ ఏడాదిలో 550 చెరువుల్లో మొత్తం 3.04 కోట్ల చేపపిల్లలను వేయగా 5,176 టన్నుల ఉత్పత్తి వచ్చింది. దీంతో 41.40 కోట్ల ఆదాయం చేకూరింది. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతోపాటు జిల్లాలోని 342 నీటిపారుదల చెరువుల్లో, 491 చెరువుల్లో చేపపిల్లలను వదిలారు. ఎస్సారెస్పీలో 2017-18 లో 2.67 కోట్ల చేప పిల్లలను వదులగా 2018 మార్చి వరకు
జిల్లాలో 12,108 టన్నుల చేపల ఉత్పత్తి జరిగింది. మత్స్యకారులకు 96 కోట్ల రాబడి వచ్చింది. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 200 చెరువుల్లో 53,41,150 చేపలను చెరువుల్లో పెంచగా.. ఇప్పటివరకు 31.20 లక్షల చేపలను మార్కెట్‌కు తరలించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 40 చెరువులతోపాటు కుమ్రంభీం, వట్టివాగు, జగన్నాథ్‌పూర్, చెలిమెలవాగు ప్రాజెక్టుల్లో రూ.70.39 లక్షల విలువ చేసే 77.37 లక్షల చేప పిల్లలను వేశారు. 2 వేల టన్నులకుపైగా ఉత్పత్తి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో 19 మత్స్య సహకార సంఘాల్లో రెండువేలకు పైగా మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. జనగామ జిల్లాలోని 364 చెరువుల్లో దాదాపు 1.04 కోట్ల విలువైన 1.46 కోట్ల చేప పిల్లలను వదిలారు. 154 మత్య్స కార్మిక సహకార సంఘాలలో 11,500 మంది సభ్యులు ఈ చేప పిల్లల ద్వారా ఉపాధి పొందుతున్నారు. 6,545 టన్నుల మత్య్స సంపద వృద్ధి చెందింది. 3 కోట్ల95 లక్షల 88,680 రూపాయల ఆదాయం సమకూరింది.
మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 5.21 కోట్ల చేప పిల్లలను 1,028 చెరువులలో పెంచుతున్నారు. వీటిలో 2,300 మెట్రిక్ టన్నుల చేపలు ఉత్పత్తయ్యాయి. వీటి ద్వారా 172.50 కోట్ల ఆదాయం లభించింది. పెద్దపల్లి జిల్లాలో 2016లో 123 చెరువులు, కుంటలతోపాటు ఎల్లంపల్లి రిజర్వాయర్‌లో 24 లక్షల 70వేల చేప పిల్లలను వేయగా 12 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. మెదక్ జిల్లావ్యాప్తంగా 235 మత్స్య సహకారసంఘాల్ల్లో 13, 500 మంది సభ్యులు ఉన్నారు. 428 చెరువులు, కుంటలు, ఒక ప్రాజెక్టులో 2.09 కోట్ల వ్యయతో 2.48 కోట్ల చేప విత్తనాలు 2017-18 సంవత్సరానికి అందించారు. సుమారు 37 కోట్ల విలువైన 6, 500 టన్నుల చేపల ఉత్పత్తి జరిగిందని అధికారులు అంచనా వేశారు. సూర్యాపేట జిల్లా ఈ ఏడాది మత్స్య కార్మికుల ఆదాయం 100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాలోని చెరువుల్లో 5,661 టన్నుల మత్స్యసంపద ఉంది. దీని విలువ దాదాపు 34 కోట్లు చేస్తుంది. వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా 316 చెరువుల్లో 97.88లక్షల చేప పిల్లల్ని వేశారు. 2017-18లో 476 చెరువుల్లో వేసిన చేప పిల్లల ద్వారా దాదాపు 4120 టన్నుల ఉత్పత్తి వస్తుంది. విలువ రూ.33 కోట్ల దాకా రావచ్చని జిల్లా మత్స్యశాఖ అధికారి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయంలో చేపల వేట ప్రారంభించారు. ఈ జలాశయం పరిధిలో 1800 మంది మత్సకారుల కుటుంబాలకు లబ్ది కలిగేలా 13లక్షల చేప పిల్లలను ఉచితంగా అందించింది. వరంగల్ రూరల్ జిల్లాలోని నీటి నిల్వ ఉన్న 194 చెరువులతోపాటు రెండు రిజర్వాయర్లలో 2016-17లో రూ.45 లక్షల ఖర్చుతో 95.58 లక్షల చేప పిల్లలను వేశారు. వీటినుంచి 5300టన్నుల చేపలు ఉత్పత్తి చేశారు. దీనిమొత్తం విలువ రూ.74 కోట్ల 25 లక్షలుగా అధికారవర్గాలు తెలిపాయి. సంగారెడ్డి జిల్లాలో చేపల పెంపకం ద్వారా మత్స్యకారులు రూ.108 కోట్ల ఆదాయం పొందుతున్నారు. సింగూరు ప్రాజెక్టులోనే 60 లక్షల పిల్లలు వేయగా జిల్లాలోని 446 చెరువుల్లో మిగతా చేప పిల్లలను వదిలారు. మత్స్యశాఖ అంచనా ప్రకారం 18 వేల టన్నుల చేపల దిగుబడి రానున్నది. మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వం 51.56 లక్షల చేపలను వదిలితే నేడు జిల్లా పరిధిలోని మత్స్యకారులకు 16.06 కోట్ల ఆదాయం సమకూరింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 3538 చెరువుల్లో 5.74 కోట్ల చేప విత్తనాలను పంపిణీచేయగా 34,168 టన్నుల చేపల ఉత్పత్తి జరిగింది.
మెదక్-కామారెడ్డి జిల్లాల సరిహద్దున ఉన్న పోచారం ప్రాజెక్టులో చేపల పెంపకంతోపాటు 6.20 లక్షల టన్నుల రొయ్యలను పెంచుతున్నారు. ప్రస్తుతానికి 12 టన్నుల రొయ్యలు ఉత్పత్తి జరిగినట్టు అధికారులు పేర్కొంటున్నారు.
గణనీయంగా చేపల ఉత్పత్తి




