జిల్లా క్లలెక్టరేట్ల వద్ద రైతు సంఘాల ఉమ్మడి ధర్నాలు
కిసాన్ ముక్తి బిల్లుల కోసం దేశవ్యాప్త కార్యక్రమాలు
తెలంగాణా రైతు సంఘాల వెల్లడి
హైదరాబాద్,మే9(జనం సాక్షి): తెలంగాణా రాష్ట్రంలో అన్ని జిల్లా క్లలెక్టరేట్ల వద్ద, కొన్ని డివిజన్ కేంద్రాల వద్ద అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ సమితి ఆధ్వర్యంలో రైతు సంఘాలు ఉమ్మడిగా ధర్నా కార్యక్రమాలు నిర్వహించాయి. దేశ వ్యాప్తంగా 1857 ప్రథమ స్వాతంత్య సమర వార్షికోత్సవం సందర్భంగా, రైతులందరూ కిసాన్ ముక్తి బిల్లులను డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో మే 10వ తేదీన ఈ కార్యక్రమాలు జరుగుతుండగా, తెలంగాణా రాష్ట్రంలోని సంఘాలు మే 9వ తేదీనే నిర్వహించాయి. ప్రతి జిల్లాలోను గత వారంలో వేలాది మంది రైతులతో సంతకాల సేకరణ చేసిన రైతు సంఘాలు రూపొందించిన ‘రైతులకు రుణభారం నుండి విముక్తి’, ‘రైతులకు లాభసాటి మద్దతు ధరల గ్యారంటీ’ అనే రెండు బిల్లులపై పార్లమెంట్లో ప్రత్యేక చర్చ జరిపి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ లోక్ సభ స్పీకరుకి, రాజ్యసభ చైర్మన్ కి వినతి పత్రాలు పంపారు. దేశవ్యాప్తంగా 194 రైతు సంఘాలతో అతి పెద్ద కూటమిగా ఉన్న అఖిలభారత రైతాంగ సమన్వయ సమితి దేశవ్యాప్త కిసాన్ ముక్తి యాత్ర ద్వారా తయారు చేసిన ఈ రెండు బిల్లులకు పార్లమెంట్లోని 21 రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఇటీవల ఢిల్లీలో సమావేశంలో శరద్ పవార్, మల్లికార్జున్ ఖర్గే, శరద్ యాదవ్, దినేష్ త్రివేదీ, సీతారాం ఏచూరి, ఫరూఖ్ అబ్దుల్లా వంటి 15 మంది సీనియర్ నాయకులు ఈ బిల్లులను పార్లమెంట్లో సాధించడానికి కృషి చేస్తామని ప్రకటించారు. తెలంగాణాలో 24 రైతు,వ్యవసాయ కూలీ సంఘాలు దీనిలో భాగంగా ఉన్నాయి. తెలంగాణా రైతు సంఘం, అఖిల భారత రైతుకూలీసంఘం, రైతు స్వరాజ్య వేదిక, తెలంగాణా రాష్ట్ర రైతు సంఘం, తెలంగాణా రైతు జే.ఏ.సి., తెలంగాణా రైతాంగ సమితి, తెలంగాణా రైతు కూలీ సంఘం, తెలంగాణా కౌలు రైతుల సంఘం వంటివన్నీ దీనిలో భాగస్వాములుగా ఉండి బుధవారం కార్యక్రమాలలో పాల్గొన్నాయని తెలిపారు. వివిధ రైతు సంఘాల రాష్ట్ర నాయకులు వివిధ జిల్లాలలో పాల్గొన్నారు. తెలంగాణా రైతు సంఘం నుండి టి.సాగర్ మహబూబ్ నగర్‌లో, జంగారెడ్డి వికారాబాద్ లో; రైతు స్వరాజ్య వేదిక నుండి విస్సా కిరణ్ కుమార్, బి.కొండల్ భువనగిరి లో, బీరం రాములు వరంగల్ లో, సంగెపు బొర్రన్న ఆదిలాబాద్ లో; అఖిల భారత రైతు కూలీ సంఘం నుండి కెచ్చెర్ల రంగయ్య కొత్తగూడెంలో, కోటేశ్వర రావు సూర్యాపేటలోను; తెలంగాణా రాష్ట్ర రైతు సంఘం నుండి పశ్య పద్మ రంగారెడ్డి జిల్లాలో, విశ్వేశ్వర్ మహబూబాబాద్ లో; తెలంగాణా రైతు జే.ఏ.సి. నుండి కన్నెగంటి రవి రంగారెడ్డి లో, ధర్మార్జున్ సూర్యాపేట జిల్లలో; తెలంగాణ రైతాంగ సమితి నుండి జక్కుల వెంకటయ్య వనపర్తి జిల్లాలో; తెలంగాణ రైతు సంఘం నుండి మోర్తాల చందర్ రావు వరంగల్ లోను, పాల్గొన్నారు.
వాస్తవ సాగుదారులందరికీ పెట్టుబడి సాయం అందాలన్న డిమాండ్ మేరకు జిల్లా క్లలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేసి వేల సంతకాలతో వినతి పత్రాలను ఇవ్వడమే కాకుండా, రైతు బంధు పథకాన్ని వాస్తవ సాగుదారులందరికీ అందించాలని కూడా రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని ప్రకటించారు. తెలంగాణాలో 11లక్షలకు పైగా కౌలు రైతులు, దాదాపు రెండు లక్షల ఎకరాలు పోడు భూమి సాగు చేస్తున్న
ఆదివాసీ రైతులు, లక్షలాది మంది సాదా బైనామాపై భూమి కలిగిన రైతులు ఉండగా, ప్రభుత్వం కేవలం భూమి పట్టాదారులకే ‘పెట్టుబడి సాయం’ పథకాన్ని వర్తింపజేయడం అన్యాయం అని రైతు సంఘాల నాయకులు అన్నారు. వాస్తవ సాగుదారులే పెడుతున్నప్పుడు వారిని పథకం నుండి బయట పెట్టడం వారి హక్కుల ఉల్లంఘన అని, ప్రజా ధనం దుర్వినియోగం చెయ్యడం అని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు.తెలంగాణా రైతు ఆత్మహత్యలలో 70 శాతం కౌలు రైతులే ఉండగా, వారిని అప్పుల ఊబిలో నుండి రక్షించే చర్యలు ప్రభుత్వం అసలు తీసుకోవట్లేదు. 2011 భూ అధీకృత సాగుదారుల చట్టం ప్రకారం కౌలు రైతులందరికీ రుణ అర్హత కార్డులు ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు.




