Wednesday, 4 November 2026

విజయవంతంగా కొనసాగుతున్న కంటివెలుగు

జిల్లాల్లో చురుకుగా పరీక్షలు

అవసరమైన వారికి ఆపరేషన్ల నిర్వహణ

హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): అంధత్వ రహిత తెలంగాణెళి లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నేత్రవైద్య శిబిరాల్లో గత నాలుగు రోజులుగా 3 లక్షల 23 వేల 956 మందికి కంటిపరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 87వేల 904 మందికి ఎటువంటి కంటి సమస్యలు లేవని వైద్యులు నిర్ధారించారు. 35 వేల 721 మందికి కండ్లద్దాలను అందజేశారు. ప్రత్యేక దృష్టిలోపం ఉన్న వారికోసం 51,030 అద్దాలను ప్రతిపాదించిన వైద్యులు.. 48,088 మందిని కాటరాక్ట్‌ ఆపరేషన్లకు సిఫార్స్‌ చేశారు. ఇందులో 2,351 మందికి ఆపరేషన్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 114 దవాఖానల్లో కాటరాక్ట్‌ ఆపరేషన్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు వివరాలను ప్రకటించారు. కంటివెలుగు పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 822 చోట్ల శిబిరాలునిర్వహించారు. ఈ శిబిరాల్లో 92,119 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. 5,272 మందికి కండ్లద్దాలను అందజేశారు. దృష్టిలోపం ఉన్నవారికి 6,873 ప్రత్యేక అద్దాలను ప్రతిపాదించిన వైద్యులు.. కాటరాక్ట్‌ ఆపరేషన్లకు 11,090 మందిని సిఫార్స్‌ చేశారు. 703 కాటరాక్ట్‌ ఆపరేషన్లను నిర్వహించారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కంటి వెలుగు శిబిరాల సందడి నెలకొంది. ఆదిలాబాద్‌ పట్టణంలోని బుక్తాపూర్‌ కాలనీలో శిబిరానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌ మండలం సింగపూర్‌లో కంటి వెలుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే దివాకర్‌ రావు పాల్గొన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు 3993 మంది నేత్ర పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో 1,637మందికి కళ్ళజోళ్లు పంపిణీ చేయగా, 475 మందికి ఆపరేషన్ల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరంలో 200 మందికి పైగా పరీక్ష చేయించుకున్నారు. జనగామ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 5320 మందికి స్కీన్రింగ్‌ చేయగా.. 1139 మందికి కండ్లద్దాలను అందించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 18 కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేశారు. గత 4 రోజులుగా 6400 మందికి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పటి వరకు 1483మందికి కళ్ళద్దాలు అందించిన వైద్యులు.. 1255 మందిని ఆపరేషన్‌ కోసం సిఫార్సు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ మండలం సర్వారం గ్రామంలో కంటి వెలుగు క్యాంప్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శాంతి కుమారి సందర్శించారు. కంటివెలుగు నిర్వహణను దగ్గరుండి పరిశీలించారు. మొత్తంగా కంటి వెలుగు పథకంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నేత్ర వైద్య శిబిరాలకు వస్తున్న వృద్ధులు, పేదలంతా సీఎం కేసీఆర్‌కు మనసారా కృతజ్ఞతలు చెబుతున్నారు.