గురుకులాల ఏర్పాటుతో మారిన పరిస్థితి
విద్యాహబ్‌గా గజ్వెల్ కేంద్రం
వరంగా మారిన సిఎం కెసిఆర్ దూరదృష్టి
హైదరాబాద్,జనవరి26జనంసాక్షి): రాష్ట్రంలో విద్యారంగం ప్రగతిబాటలో దూసుకెళ్తున్నది. నాలుగేండ్లలో ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలను తలదన్నేలా సర్కార్‌విద్యను తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దింది. గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్న వేళ గతంతో పోలిస్తే విద్యారంగంలో తెలంగౄణ ఎంతో ముందుచూపుతో ఉంది. దూరదృష్టితో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇంగ్లిష్ విూడియం బోధన, సంక్షేమశాఖలవారీగా బాల, బాలికలకు గురుకులాల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధుల కేటాయింపు, ఖాళీపోస్టుల భర్తీ, కాంట్రాక్టు, ప్రత్యేక, పార్ట్‌టైం ఉద్యోగుల వేతనాల పెంపు, ఇంటర్‌లో ఉచిత విద్య, స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయింబర్స్‌మెంట్, ఆన్‌లైన్ సేవలు వంటి సంస్కరణలు చేపట్టారు. వచ్చే ఐదేండ్లలో ఎనిమిది లక్షల మంది విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పించాలనే భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. గజ్వేల్ నియోజకవర్గంలో విద్యాహబ్‌ను నిర్మించి దేశానికి రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దారు. ఫలితంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో కలిపి 1.30 లక్షల వరకు ఎన్‌రోల్‌మెంట్ పెరిగింది. రానున్న ఐదేండ్లలో అన్ని సంక్షేమ గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలలో కలిపి మొత్తం 1,725 గురుకులాలు పాఠశాలలు అందుబాటులోకి రావడంతోపాటు వాటిలో 8,60,310 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. రాష్ట్రంలో 41,337 ప్రభుత్వ పాఠశాలల్లో 58,66,786 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఖాళీగాఉన్న 8,972 టీచర్ల పోస్టులను భర్తీచేశారు. 15 వేల మంది విద్యావాలంటీర్లను నియమించారు. దీంతో ప్రభుత్వబడుల్లో బోధకులు లేరనే మాట వినిపించడం లేదు. సర్వశిక్ష అభియాన్, రాష్టీయ్ర మాధ్యమిక శిక్ష అభియాన్ పథకాల కింద నూతన భవనాలు, ప్రహరీలు, మరుగుదొడ్ల నిర్మాణాలు, మౌలిక వసతులు, ఆర్వోప్లాంట్లు, బయోమెట్రిక్ మిషన్లు, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి 44,588 పనులను చేపట్టగా 38,182 పనులను పూర్తిచేశారు. రాష్ట్రంలోని 391 కేజీబీవీల్లో 72,824 మంది బాలికలు చదువుతున్నారు. 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సుమారు రెండు లక్షల మంది చేరారు. 22 రకాల సేవలను ఆన్‌లైన్ పరిధిలోకి తీసుకొచ్చారు.
ఆదుకుంటున్న ఫీజు రీయింబర్స్‌మెంట్
రాష్ట్రంలోని పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌లతోపాటు డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, వృత్తివిద్య కోర్సుల విద్యార్థులందరికీ ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నది. ప్రతి ఏడాది 14 లక్షల మంది విద్యార్థులకు రూ.2,400 కోట్లు ఖర్చు చేస్తున్నది. రాష్ట్రంలోని 27 గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేశారు. కొత్తగా 405 పోస్టులను కొత్తగా మంజూరు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్యకోసం ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నారు. 48 నెలల్లోనే 1,864 మంది లబ్ధి పొందారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ప్రభుత్వం రూ. 9,280 కోట్లను ఖర్చు చేస్తుంది. విద్యార్థులకు మెస్‌చార్జీలను పెంచింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో డిజిటల్ విద్యాబోధన ప్రవేశపెట్టింది. ప్రభుత్వ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు, పాలిటెక్నిక్, డిగ్రీ లెక్చరర్లకు, పార్టు టైం లెక్చరర్లకు, అటెండర్లకు కూడా 100 శాతం జీతాలు పెంచారు. మాతృభాష పరిక్షణ కోసం పదోతరగతి వరకు తెలుగు ను 2018-19 నుంచి బోధనను తప్పనిసరి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 298 గురుకులాలు ఉండగా, కొత్తగా 663 గురుకులాలు, మరో 53 గురుకుల డిగ్రీ కాలేజీలు, 30 మహిళా గురుకులను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఒక్కొక్క విద్యార్థిపై ప్రతి ఏడాదికి సగటున లక్షకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది.




