సమాజ పురోభివృద్దికి ఇదే తొలిమెట్టు
హైదరాబాద్,జూన్12(జనం సాక్షి): విద్యావ్యాప్తితోనే ఆదర్శమైన సమాజాన్ని నిర్మించగలుగుతాం. విద్యపై ఎంత ఖర్చు చేసినా అది దేశానికి పెట్టుబడిగానే గుర్తించాలి. ప్రభుత్వాలు కూడా ఈరంగంలో మరిన్ని నిధులు కేటాయించి అవసరమైన సౌకర్యాలు కల్పించడం ద్వారా విద్యారంగాన్ని మరింతగా బలోపేతం చేయాలి. విద్యారంగ అభివృద్దికి, పేదలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం వేలకోట్ల రూపాయాలను ఖర్చు చేస్తోంది. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి విద్యను అందించాలని లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. స్వాతంత్య్రానంతరం లక్షల కోట్లు ఈ రంగంలో ఖర్చు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. అందరికి విద్య అందితే సమాజం పురోగమిస్తుంది. ఇందుకు టీచర్లు కూడా తమవంతుగా వినూత్న ప్రయోగాలతో సమాజానికి మేలు కలిగేలా ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దడంలో ముందుకు సాగాలి. ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరేలా తమవంతుగా కృషి చేయాలి. ఇటీవల ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ నిబంధనలకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో దీర్ఘకాల వివాదానికి తెరపడింది. వివాదాలు, న్యాయపరమైన చిక్కులతో 1998 నుంచి కోర్టుల్లో నలుగుతున్న ఏకీకృత సర్వీస్ రూల్స్ వల్ల ఇక సమస్యలు లేకుండా, పలురకాల యూనియన్ల పేరుతో సాగకుండా వద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా నడవాలి. ఎంతసేపు తమ సమస్యలపైనే దృష్టి పెట్టకుండా పేద విద్యార్థులను ఉత్తమ పౌరులగా దేశానికి అందంచేందుకు కృషి చేయాలి. ఈ రకంగా ప్రభుత్వానికి అసవరమైన సూచనలు సలహాలు ఇవ్వాలి. నిజానికి టీచర్లను పలు రకాలుగా విభజించకుండా చూడడం వల్ల వారిలో కూడా సమ భావం వస్తుంది. ఎట్టకేలకు ఉమ్మడి సర్వీస్ నిబంధనలు రావడం హర్షణీయం. ఈ సమస్య పట్ల గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలతో ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగటమే కాకుండా విద్యావ్యవస్థకుఅంతకన్నా ఎక్కువగా నష్టం ఒనగూడింది. ఉపాధ్యాయ లోకంలో నెలకొన్న అనిశ్చితి, అసంతృప్తి కారణంగా మొత్తంగా విద్యావ్యవస్థనే జవసత్వాలు కోల్పోయింది. పర్యవేక్షణాధికారులు, సంబంధిత అధికారులు లేక పాఠశాల స్థాయి నుంచి, మండలం, జిల్లా దాకా సర్వత్రా జవాబుదారీతనం లోపించి విద్యాప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయి. గత ప్రభుత్వాలు ముందు చూపుతో, చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడం వల్ల ఉపాధ్యాయ వర్గాల్లో కృత్రిమ విభజన, అసమ ప్రాధాన్యాలు విద్యారంగానికే శిరోభారంగా మారాయి. కోర్టువివాదాల కారణంగా దశాబ్దాల కాలంగా పదోన్నతుల పక్రియ కొనసాగక ఆయా విభాగాలన్నీ నీరుగారిపోయాయి. సమాన పనికి సమాన వేతనం అన్నది రాజ్యాంగబద్ధమైన హక్కు. అలాగే ఒకే విధమైన పనితో, ఒకే యాజమాన్యం కింద పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో కూడా సమాన గౌరవం, పదోన్నతుల్లో సమన్యాయం అనేది కూడా న్యాయ సమ్మతమైనది. కానీ ఉపాధ్యాయులు సమాజంలో అంతర్భాగంగా ఉండాలని భావించి, పాఠశాల విద్యను స్థానిక సంస్థల పరిధిలోకి తెచ్చారు. ఈ క్రమంలో జిల్లాపరిషత్ నియామకాలు ఉనికిలోకి వచ్చాయి. అయితే వీరిని లోకల్ క్యాడర్‌గా పరిగణించక పోవటంతో ఉపాధ్యాయుల్లో ప్రభుత్వ, పంచాయతీ రాజ్ అనే కృత్రిమ విభజనకు అంకురార్పణ జరిగింది. తమను కూడా స్థానిక క్యాడర్‌గా గుర్తించి పదోన్నతుల్లో తగు న్యాయం జరుగాలని 1975 నుంచే పంచాయతీరాజ్ టీచర్లు ఉద్యమిస్తున్నారు. పట్టణ ప్రాంత పాఠశాలల్లో పనిచేస్తూ ప్రభుత్వంచే నియమితులైన ఉపాధ్యాయులు మాత్రం పంచాయతీరాజ్ టీచర్ల డిమాండ్‌ను వ్యతిరేకిస్తూకోర్టుకు ఎక్కడంతో ఈ సమస్య చిక్కుముడిగా మారింది. ఎట్టకేలకు ఉమ్మడి సర్వీస్ నిబంధనలు రావడం హర్షణీయం. ప్రభుత్వాలు పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి ముందుకు పోతున్న నేపథ్యంలో కేటాయింపులుకూడా పెరగాల్సి ఉంది.




