Thursday, 5 November 2026

తెలంగాణలో ప్రభుత్వ విద్యకు పెరుగుతున్న ప్రాధాన్యం

కెజి టూ పిజి లక్ష్యంగా విద్యాసంస్కరణలు

సాకారం అవుతున్న కెసిఆర్‌ ప్రణాళికలు

హైదరాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి): తెలంగాణ ఉద్యమ స్వప్నం కేజీ టు పీజీ విద్యాపథకం అమలుకు కార్యాచరణ మొదలైంది. ప్రభుత్వం గత రెండేండ్లుగా ఇందుకోసం బలమైన పునాదులు వేసింది.దీనివల్ల వచ్చే రెండేండ్లలో కేజీ టు పీజీ విద్య పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో కేవలం 296 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండేవి. రాష్ట్ర అవతరణ తర్వాత రెట్టింపు సంఖ్యలో గురుకుల పాఠశాలలు ఏర్పాటయ్యాయి. వాటిలో 1,31,445 మంది విద్యార్థులు, కళాశాలల్లో 9120 మంది విద్యార్థులు చేరారు. ఇప్పటిదాకా 489 గురుకుల పాఠశాలలు, 31 డిగ్రీ రెసిడెన్షియల్‌ కళాశాలలను ప్రారంభించింది. ఈ ఏడాది పాఠశాలల్లో 5,6,7 తరగతులకు, డిగ్రీ గురుకులాల్లో ఫస్టియర్‌కు అడ్మిషన్లు నిర్వహించింది. 2,68,955 విద్యార్థులకు అవకాశం లభించింది. ఇకపై ఏటా పాఠశాలలు కళాశాలల సంఖ్యతోపాటు తరగతుల అప్‌గ్రెడేషన్‌ జరుపుతూ ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం సంకల్పంగా ఉంది.కొత్తగా ప్రారంభమైన పాఠశాలల్లో ప్రభుత్వం 5,6,7 తరగతులకు అడ్మిషన్లను నిర్వహించింది, ఇక డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ మొదటి సంవత్సరానికి అడ్మిషన్లు నిర్వహించింది. పాఠశాలలు, కళాశాల్లో విద్యార్థులు కొత్తగా పై తరగతులకు వెళుతున్న కొద్దీ వాటిని అప్‌గ్రెడేషన్‌ చేస్తారు. ఇలా మరో రెండేండ్లలో రెసిడెన్షియల్‌ కళాశాలల్లో చదివిన విద్యార్థుల కోసం పీజీ కాలేజీలు ఏర్పాటవుతాయి. దీంతో కే జీ టూ పీజీఉచిత విద్య సంపూర్ణంగా అమలులోకి వస్తుంది. విద్య, వైద్యంపై ఎంతైనా ఖర్చు చేయడానికి సీఎంకేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సర్కారు దవాఖానలో కార్పొరేట్‌ వైద్యం అందేవరకు అది కొనసాగుతుందని చెప్పారు.సమైక్య పాలనలో తెలంగాణలో మానవ వనరుల అభివృద్ధి అంశం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. విద్యాహక్కు అందని ద్రాక్షపండులా మారింది.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ విద్యార్థులు ఉత్తమవిద్యకు దూరమయ్యారు. తెలంగాణ పునర్నిర్మాణంలో మానవవనరుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. ఉద్యమ సమయంలో తాను కలలుగన్న కేజీ టు పీజీ పథకానికి రూపమిచ్చారు. రాష్ట్రంలో 80 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను నాణ్యమైన విద్యతో ఉద్యోగులుగా, పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దినప్పుడే ఆ వర్గాల అభ్యున్నతి సాధ్యమని కేసీఆర్‌ విశ్వసించారు. ఈ మేరకు భారీ సంఖ్యలో రెసిడెన్సియల్‌ స్కూళ్లను ప్రారంభించారు. ఒక్కో పాఠశాలకు, కళాశాలకు భవనాలు, మౌలిక సదుపాయాలకోసం రూ.కోటి వరకు వెచ్చించారు. భోజనం, పుస్తకాలు, హాస్టల్‌, స్కూల్‌ నిర్వహణ తదితరాలకింద ఒక్కో విద్యార్థి విూద సగటున రూ.70 వేలు ఖర్చు చేశారు. ఈ ఏడాది 2,68,955 మంది విద్యార్థులకు అవకాశం కల్పించారు. అలాగే 31 జూనియర్‌ కళాశాలల్లో 9120 విద్యార్థులను చేర్చుకున్నారు. ఇలా ఒక్క ఏడాదికి సగటున రూ. 2 వేల కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చిస్తున్నది. ఈ పాఠశాలల ద్వారా మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. రెసిడెన్షియల్‌ కళాశాలల్లో చదివిన వారిలో 49 మందికి ఎంబీబీఎస్‌లో, 23 మందికి బీడీఎస్‌లో సీట్లు వచ్చాయి. నిరుపేద కుటుంబాలనుంచి వచ్చిన విద్యార్థులు డాక్టర్లు అయ్యే అవకాశం ఈ రెసిడెన్షియల్‌ స్కూళ్ల ద్వారా లభించింది. రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఇబీసీలలోని పేదలకు కూడా ఇస్తున్నారు. దీంతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు కూడా ఈ పాఠశాలల్లో ఉచితంగా చదువుకోవడానికి అవకాశం వచ్చింది.