హుజూర్ నగర్ జూన్ 28 (జనం సాక్షి): చదువుల పోటీలో విద్యార్థినీ, విద్యార్థుల చిట్టి భుజాలపై బడి సంచి పుస్తకాల బరువు మోయలేని గుదిబండగా మారింది. బాల్యంపై మోత బరువును తగ్గించాలనే ప్రతిపాదనలు, నిపుణుల సూచనలు, నిబంధనలు వంటివేవీ సరైన రీతిలో కార్యాచరణకు నోచుకోలేదనే విమర్శలున్నాయి. కిలోలకొద్దీ బరువుల్ని ఏళ్లపాటు మోయడం భవిష్యత్తులో చిన్నారుల ఆరోగ్యానికి హానికరమన్న సంగతిని అందరూ గుర్తించాలి. దేశంలో బడి సంచులకు సంబంధించి రూపొందించిన నిబంధనలు నిర్దిష్టంగా అమలుకు నోచుకోవడం లేదు. 2020లో కొత్త మార్గదర్శకాలు వచ్చినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రతిసారీ విద్యాసంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వ యంత్రాంగాలు సంబంధిత నిబంధనలను జారీ చేయడం రివాజుగా మారిపోయింది. ప్రభుత్వ ఆదేశాలు ఎక్కడా మచ్చుకైనా కనిపించడం లేదు. సమీక్షలు, పరిశీలనలు, పర్యవేక్షణలు, దృష్టి సారించడం వంటి ప్రక్రియలు మాటలకే పరిమితం అవుతుండటం వల్ల చిన్నారుల భవిత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏళ్ల తరబడి బరువైన బడి సంచుల్ని మోయడం వల్ల యుక్తవయస్సు వచ్చేసరికి భుజాలు, వెన్నెముకకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.పది కిలోలకు పైనే…ఒకటి నుంచి పదో తరగతిదాకా విద్యార్థి శరీర బరువులో సంచీ భారం 10శాతంలోపే ఉండాలని ‘బడి సంచీ విధానం-2020’ స్పష్టంచేసింది. ప్రీప్రైమరీలో బడి సంచుల అవసరం లేదని వెల్లడించింది. ఈ విధానం కింద విధిగా సంచి బరువును తగ్గించడంతో పాటు రెండో తరగతిదాకా ఎలాంటి హోంవర్క్ ఇవ్వకూడదని స్పష్టీకరించింది. 3,4,5 తరగతులకు హోంవర్క్‌ను వారానికి గరిష్ఠంగా రెండు గంటలకు పరిమితం చేసింది. దీనికి అనుగుణంగా పాఠ్యప్రణాళిక మేరకు అవసరమైన పుస్తకాలనే బడికి తీసుకెళ్ళాల్సి ఉంటుంది. బరువైన నోట్ పుస్తకాలకు బదులు తేలికపాటివే ఉపయోగించాలి. వీటిపై తరగతి ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలి. చిన్నారులు భుజానికి తగిలించుకునే సంచుల బరువు కూడా తక్కువగానే ఉండాలి. బడి సంచీ చతురస్రంగా రెండు భుజాలకూ సరిపోయేలా రెండు పట్టీలతో ఉండాలి. నోటు బుక్కులు, పాఠ్య పుస్తకాలతో పాటు ఆహారం, నీటి సీసాలు అదనపు బరువుగా మారుతున్నాయి. అయిదారు తరగతుల్లో ఉండే విద్యార్థుల బడి సంచుల బరువు పది కిలోలకుపైగానే ఉంటోంది. ప్రైవేట్ పాఠశాలలు ఎక్కువమేర బహుళ అంతస్తుల్లో ఉంటుండటంతో చిన్నారులు భారీ బరువులతో మెట్లెక్కి వెళ్లాల్సి వస్తోంది. చాలామేర పాఠశాలల్లో సురక్షిత తాగునీటి వ్యవస్థ లేకపోవడం వల్ల విద్యార్థులు ఇంటివద్ద నుంచే నీటి సీసాలను మోసుకెళ్ళాల్సిన దుస్థితి దాపురిస్తోంది. చిన్నారులకోసం రక్షిత నీటిని సమకూర్చాల్సిన పాఠశాలలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. దీనికితోడు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారీతిన వివిధ రకాల ముద్రణ సంస్థలకు చెందిన పుస్తకాలను వినియోగిస్తుండటం సమస్యగా మారుతోంది. దీనివల్ల ఒక్కో తరగతి విద్యార్థి పుస్తకాలు, నోటుబుక్కులు ఇతరాలు కలిపి 30 నుంచి 40 దాకా కొనుగోలు చేయాల్సి వస్తోంది. కొన్నిసార్లు అవసరం లేని పుస్తకాలనూ విద్యార్థులపై బలవంతంగా రుద్దుతున్నారు. వీటన్నింటి ఫలితంగా పెద్దసంఖ్యలో పుస్తకాలు, నోటుబుక్కుల్ని సంచుల్లో కుక్కి, బడులకు మోసుకురావాల్సిన అగత్యం ఏర్పడుతోంది. ఇలాంటి అదనపు బరువుల నుంచి విముక్తి కలిగితేనే విద్యార్థులకు మానసికంగా, శారీరకంగా ఉపశమనం లభిస్తుంది.
అందరి బాధ్యత…ఎన్నో ఏళ్లుగా ఏమాత్రం మార్పులేకుండా సాగుతున్న బడి సంచి బరువును తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారానికి ఒకరోజును సంచీ రహిత దినంగా నిర్దిష్టంగా అమలు చేయాలి. తరగతి గదుల్లోనే విద్యార్థులు తమ పుస్తకాలను భద్రపరచుకొనే సౌలభ్యాన్ని కల్పించడం వల్ల అనవసరపు బరువుల్ని మోసే అగత్యం తప్పుతుంది. ఇందుకోసం అవసరమైన మౌలిక సదుపాయాల్ని పాఠశాలలు యుద్ధప్రాతిపదికన సమకూర్చుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లోనూ తగిన ఏర్పాట్లు కల్పించాల్సిన అవసరం ఉంది. బడి సంచుల బరువుపై విద్యాశాఖ యంత్రాంగం పరంగా నిరంతర నిఘా, పర్యవేక్షణ కొనసాగాలి. విద్యార్థుల బడి సంచుల బరువుల్ని తనిఖీ చేసే ప్రక్రియ తరచూ చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించే పాఠశాలల యాజమాన్యాలపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. పాఠశాలల్లో నిర్వహించే కమిటీ సమావేశాల్లో తల్లిదండ్రులు తరచూ పాల్గొంటూ విద్యార్థుల ఇక్కట్లను యాజమాన్యాల దృష్టికి తీసుకొస్తుండాలి. బడి సంచుల భారాన్ని తగ్గించే దిశగా సూచనలు అందిస్తూ, తగిన కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు కృషి చేయాలి. ఈ విషయంలో తల్లిదండ్రులకు సైతం తగిన అవగాహన పెరగాలి. విద్యాభ్యాసం ఎంత ముఖ్యమో, చిన్నారుల ఆరోగ్యం భావి జీవితం కూడా అంతే కీలకమన్న సంగతిని పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, అధికార యంత్రాంగాలూ గుర్తించి తదనుగుణంగా ముందుకు సాగడం ముఖ్యం.
విద్యార్థులకు బడి సంచి మోయలేని గుదిబండ – చిట్టి భుజాలపై పుస్తకాల బరువు – మోయలేని భారంగా నేటి చదువులు – యుక్తవయస్సు వచ్చేసరికి భుజాలు, వెన్నెముకకు సంబంధించిన సమస్యలు




