హైదరాబాద్: విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో సీఎం కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్‌ఎస్‌యూఐ ఓయూ అధ్యక్షుడు అజ్మీరా మహేష్ అధ్యక్షత వహించగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి గిరీశ్ చొడంకర్, టీపీసీసీ అధికార ప్రతినిధులు మానవతరాయ్, మన్నె క్రిషాంక్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకటేశ్, ఉపాధ్యక్షుడు వీరవల్లభ, జాతీయ కార్యదర్శి సౌజన్య, రాష్ట్ర ఇంచార్జి ఫిరోజ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా డిగ్రీ ప్రవేశాల అవకతవకలు, ఎంసెట్-2 లీకేజీలో కోట్లలో కుంభకోణం, ఎంసెట్-2 రద్దు, నిబంధనలకు విరుద్ధంగా యూనివర్సిటీలకు వీసీలను నియమించడం. చివరికి నియామకాలను కోర్టు రద్దు చేయడంతో ప్రభుత్వం అభాసు పాలైందని ఎద్దేవా చేశారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో చెల్లించకపోవడం, హాస్టల్ సమస్యలు, ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం తదితర సమస్యలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఖాళీగా ఉన్న లక్ష ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయాలని, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్ డిమాండ్ చేశారు. ఎన్‌ఎస్‌యూఐ నేత రుషికేష్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి సమస్యల పరిష్కారానికి గత నెల 27న గాంధీభవన్ నుంచి ప్రారంభమైన చలో క్యాంపస్ యాత్ర పది జిల్లాలో పర్యటించి విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, విద్యార్థుల సమస్యలు తెలుసుకుని గురువారం ఓయూకు చేరుకుందన్నారు. విద్యా రంగ సమస్యలను, ఇతర అంశాలను రాష్ట్ర గవర్నర్‌కు నివేదిక అందచేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు చందన్న, సాగరిక, అనులేఖ, శ్వేత, శేఖర్, సద్దాం, అక్బర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.




