మీ అందరి తలలు నరికేస్తా.. జాగ్రత్త!! ఓ మసీదుకు భారీ బెదిరింపు వచ్చింది.
అమెరికాలోని ఓ మసీదుకు భారీ బెదిరింపు వచ్చింది. మసీదు పెద్దలందరి తలకాయలు నరికేస్తానంటూ అమెరికా సైన్యంలో పనిచేసి రిటైరైన ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించారు. టెక్సాస్ రాష్ట్రంలోని వటౌగా ప్రాంతంలో గల మస్జిద్ అల్ సాబా మసీదుకు ఈ బెదిరింపు కాల్ వచ్చింది. సాధారణంగా ఇలాంటి బెదిరింపులను పెద్దగా పట్టించుకోరు గానీ, ఈసారి మాత్రం చాలా పెద్దస్థాయిలో రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను గతంలో ఆర్మీలో పనిచేశానని చెబుతూ.. ముస్లిం మతం చాలా హింసాత్మకమైనదని, ముస్లింలు అమెరికాలో షరియత్ చట్టాన్ని తేవాలనుకుంటున్నారని, అందుకే ఈసారి మరో క్రిస్టియన్ క్రూసేడ్ రావాల్సిన అవసరం ఉందని అన్నారు.
”మీ అందరి తలలు నరికేస్తా.. నేను చెప్పేది అర్థమైందా? మీ అందరినీ నరికేస్తా” అని మరీ మరీ హెచ్చరించారు. సాధారణంగా ఇలాంటి కాల్స్‌ను కాల్ రికార్డర్‌లో రికార్డు చేసి వదిలేస్తారు. అలా ఈ కాల్ వచ్చిన వారం రోజుల వరకు దాన్ని గుర్తించలేదని మసీదు భద్రతాధికారి సైమన్ విన్సెంట్ చెప్పారు. తమకు ఇటీవలి కాలంలో పదేపదే ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయని, రంజాన్ సమయంలో ఎవరో వ్యక్తి తన రైఫిల్ నుంచి లేజర్ లైటును తమ మసీదు మీద వేశారని కూడా విన్సెంట్ తెలిపారు. గూగుల్ వాయిస్ కాల్ నుంచి ఈ కాల్ వచ్చినట్లు పోలీసులు తేల్చారు. దాని ఐపీ అడ్రస్ ద్వారా ఎక్కడి నుంచి చేశారో తెలుసుకోడానికి ప్రయత్నించారు. అయితే ఇది ఆషామాషీ బెదిరింపు కాదని, తాను ఈ ప్రాంతం వాడినేనని చెప్పి మరీ బెదిరించాడంటే ఏదో ఒకటి చేయడానికే ఫోన్ చేసి ఉంటాడని అంటున్నారు.