Thursday, 5 November 2026

 విద్యావ్యవస్థ వినాశకులు.. కాంగ్రెస్‌ నాయకులు..

డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
హైదరాబాద్‌, జూన్‌8(జ‌నం సాక్షి) : విద్యావ్యవస్థ వినాశకులు.. కాంగ్రెస్‌ నాయకులు అని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. సచివాలయంలో జరిగిన విూడియా సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ విమర్శలకు కడియం శ్రీహరి కౌంటర్‌ ఇచ్చారు. కొంతమంది విద్యావ్యవస్థను నాశనం చేశారని మాట్లాడుతున్నారు.. గతంలో విద్యావ్యవస్థను నాశనం చేసిన వారు ఇలా మాట్లాడటం విచిత్రంగా ఉందని నిప్పులు చెరిగారు. గత నాలుగేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకున్న కార్యక్రమాల వల్ల ప్రజల్లో ప్రభుత్వ విద్యపై నమ్మకం పెరిగిందన్నారు. దీనికి నిదర్శనమే మా అడ్మిషన్లు, ఫలితాలు అని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని కాంగ్రెస్‌ నేతలు పాదయాత్రలు చేపడుతారు.. నియామకాలు చేపడితే వారి అనుబంధ విద్యార్థి సంఘం నేతలు కోర్టుకెళ్లి స్టేలు తెస్తారు. ఈ డబుల్‌ గేమ్‌లు ఎందుకు అని కడియం శ్రీహరి ప్రశ్నించారు. రాష్ట్ర విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 573 గురుకుల పాఠశాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పలు పాఠశాలలను ఇంటర్‌కు అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు తెలిపారు. గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు, విద్యార్థినీలకు కిట్లును కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.