జనం సాక్షి, మంథని :తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా, వైద్య, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేశారని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం కేశన్పల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా రూ.13.32 లక్షలతో చేపట్టిన మౌళికవసతుల అభివృద్ది పనులను ఆయన ప్రారంభించారు. ఈ ప్రారంబోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఆయనకు పాఠశాల విద్యార్ధులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధు మాట్లాడుతూ..
ఆనాడు ఎంతో మంది విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల విషయంలోనే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకునే వారని, ఆర్థిక స్థోమత లేక తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించలేకపోవడం, సరైన వైద్యం అందకపోవడం, పంటల సాగు కోసం అప్పులు ఇలా అనేక విషయాల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పగా ఆలోచన చేసి ఆత్మహత్యలు లేని తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవాలని నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ క్రమంలో ప్రతిపేదవాడికి ఉన్నత విద్య అందించేలా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం, మౌళిక సదుపాయాలు కల్పించేలా మన ఊరు మన బడి కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. అదే విధంగా ప్రతిపేదవాడికి కార్పోరేట్వైద్యం అందించేలా ఆస్పత్రులను ఏర్పాటు చేశారని, ఈనాడు మంథనిలోని మాతా శిశు ఆస్పత్రిని చూస్తే అర్థం అవుతుందన్నారు. పేదింటి ఆడబిడ్డకు కాన్పు తల్లిదండ్రులకు బారం కావద్దని మాతాశిశు ఆస్పత్రుల ద్వారా ఉచితంగా కాన్పులు చేయడంతోపాటు పారిదోషికాలు అందిస్తోందన్నారు. అలాగే వ్యవసాయ రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చి ఉచితంగా కరెంటు అందించడంతోపాటు రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఆనాడు చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలన్న ఆలోచనలు గత ప్రభుత్వాలు, పాలకులు చేయలేదని కానీ ఈనాడు నీటి ఎద్దడిపెంచి చివరి ఆయకట్టుకు సాగునీరందిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైద విద్యతోపాటు సంస్కారం నేర్పుతారని అన్నారు. కార్పోరేట్లో లక్షలు ఖర్చు చేస్తే మన బిడ్డలను చదివించడం కేవలం ఉద్యోగాల కోసం కాదని, కనీసం తమ విద్యార్హతకు తగిన ఉద్యోగం కూడా పొందలేని పరిస్థితులు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడితో ప్రభుత్వ పాఠశాలలకు మహార్థశ లభిస్తోందన్నారు. తామంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకుని ఈ స్థాయిలో ఉన్నామని ఆయన గుర్తు చేశారు.
విద్యా వైద్య వ్యవసాయ రంగాలకు తెలంగాణ సర్కార్ పెద్దపీట – ఆత్మహత్యలు లేని రాష్ట్రమే సీఎం కేసీఆర్ స్వప్నం – మన ఊరు మన బడితో ప్రభుత్వ పాఠశాలలకు మహార్థశ – జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్




