– ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ పిలుపు.
బెల్లంపల్లి, మార్చ్ 23, (జనంసాక్షి )
నేటి యువత విప్లవ సింహం భగత్ సింగ్ ఆశయ బాటలో నడవాలని ఎంసిపిఐ (యు) జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ పిలుపునిచ్చారు. గురువారం బెల్లంపల్లి పట్టణంలోని రామ టాకీస్ సెంటర్ లో ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి ఎంసిపిఐ(యు) పార్టీ, ఎఐఎఫ్డిఎస్, ఎఐఎఫ్దివై జిల్లా నాయకులు పూలమాలలు వేసి ఘనంగా 92 వ వర్ధంతిని నిర్వహించారు. అనంతరం జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ మాట్లాడుతూ భరతమాత దాస్య శృంఖలాలను బద్దలు కొట్టడానికి, బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుండి తరిమి కొట్టడానికి, నూనూగు మీసాల చిన్న వయసులోనే రాజ్ గురు, సుఖ్ దేవ్ లతో కలిసి బ్రిటిష్ పార్లమెంటు పైన బాంబుల వర్షం కురిపించి చిరునవ్వులు చిందిస్తూ ఉరికొయ్యలను ముద్దాడుతూ ఇంక్విలాబ్ నినాదాన్ని దేశ యువతకు ప్రజలకు అందించి యువతను విప్లవ బాటలో పయనించాడని, బానిసత్వాన్ని ఎదిరించాలని, బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుండి పారద్రోలే వరకు విశ్రమించొద్దని నినదించిన, ప్రబోధించిన వీర కిశోరం, విప్లవ సింహం, యువతరానికి స్ఫూర్తి ప్రదాత భగత్ సింగ్ అన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయిన ఆయన మరణం ఈ దేశంలో విప్లవానికి శంఖారావాన్ని పూరించిందని, యువతరాన్ని మేల్కోలిపిందని, చైతన్యాన్ని రగిలించిందని,అన్ని వర్గాల ప్రజలను కదిలించిందని, ఎంతోమంది వీరులను, విప్లవకారులను ఆనాటి స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములను చేసిందన్నారు. ఆనాటి అమరుల త్యాగ ఫలితమే ఈనాటి స్వాతంత్ర్యమని, ఆ అమరుల కలలు ఈనాటి వరకు నెరవేరలేదన్నారు. అధికార మార్పు మాత్రమే జరిగిందని, తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చారని, ప్రజల బ్రతుకుల్లో అనువంతైన మార్పు రాలేదని, పేదరికం, దోపిడి పోలేదని, విద్య, వైద్యం, ఉద్యోగం, దున్నేవానికి భూమి, గిట్టుబాటు ధరలు, ఆడపిల్లల జీవితాలకు భద్రత మరెన్నో సమస్యలు తీరే దారి కనుచూపుమేరలో కానరావడంలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి, అవకాశవాద, ప్రజావ్యతిరేక పాలన వల్ల ఈ దేశంలోని బడుగు, బలహీన వర్గాలు, రెక్కాడితేనే డొక్కాడే కష్టజీవులు, రైతులు, వ్యవసాయ కూలీలు,అన్ని వర్గాల ప్రజలు ప్రతిరోజు పడరాని పాట్లు పడుతున్నారని, బ్రతుకు బండి లాగలేకపోతున్నారని, అందుకే అమరజీవి భగత్ సింగ్ అందించిన స్ఫూర్తితో యువత నడుము కట్టాలని, పిడికిలెత్తాలని, ఈ దోపిడి పాలనకు చరమగీతం పాడాలని జనతా ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్డిఎస్ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, ఎఐఎఫ్డివై జిల్లా కార్యదర్శి పసులేటి వెంకటేష్, ఎంసిపిఐ(యు) పార్టీ పట్టణకార్యదర్శి ఆరెపల్లి రమేష్, ఎఐఎఫ్దిడబ్ల్యు జిల్లానాయకులు దుర్గం పెద్ద లక్ష్మి, చిన్న లక్ష్మి, రాజశేఖర్, వంశీ, ఆకాష్, అరుణ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
విప్లవ సింహం భగత్ సింగ్ ఆశయ బాటలో నేటి యువత పయణించాలి.




