విలేకరులను ఘనంగా సన్మానించిన ఆరాధ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్

మోత్కూరు సెప్టెంబర్ 24 జనంసాక్షి : తుంగతుర్తిలోని సిరి ఫంక్షన్ హాల్లో శనివారం నియోజకవర్గం లోని 9 మండలాల ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లను ఆరాధ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మీడియా మిత్రులు మాట్లాడుతూ విలేకరులు ఎలాంటి జీతభత్యాలు లేకుండా ప్రభుత్వాలకు ప్రజలకు వారిదిగా పనిచేస్తున్నారని వారి శ్రమను ప్రభుత్వాలు గుర్తించకపోయినా ఒక స్వచ్ఛంద సంస్థ అయినటువంటి ఆరాధ్య ఫౌండేషన్ గుర్తించి విలేకరులను సన్మానించడం సంతోషకరమన్నారు.ఈ సందర్భంగా ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ మాట్లాడుతూ ఆరాధ్య ఫౌండేషన్ అనేది ఏ రాజకీయ పార్టీకి అనుకూలం వ్యతిరేకం కాదని పేద ప్రజల ఆకలి, కష్టాన్ని, దుఃఖాలను తీర్చేందుకే స్థాపించబడిందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ స్వచ్ఛంద సంస్థ చేసే సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఆరాధ్య ఫౌండేషన్ సేవలు తుంగతుర్తి నియోజకవర్గం తోపాటు రాష్ట్రవ్యాప్తంగా చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ఫౌండేషన్ దృష్టికి తీసుకురావాలని గుర్తు చేశారు. వివిధ మండలాలలో పనిచేస్తున్న ఆరాధ్య ఫౌండేషన్ కమిటీ సభ్యులను మీడియా ముఖంగా పరిచయం చేశారు. అనంతరం నియోజకవర్గంలోని 9 మండలాల 250 పైచిలుకు రిపోర్టర్లను శాలువాతో ఘనంగా సన్మానించారు.