విష జ్వరాల బారి నుండి ప్రజారోగ్యాన్ని రక్షించాలి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): సీజనల్ వ్యాధుల మూలంగా ప్రజలు అంటు రోగాలు , విష జ్వరాల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెల్లి సైదులు ఆవేదన వ్యక్తం చేశారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన పొల్గొని మాట్లాడారు.సీజనల్ వ్యాధుల మూలంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు విష జ్వరాల బారిన పడి తల్లడిల్లుతుంటే వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.వైరల్ ఫీవర్, టైఫాయిడ్ ,మలేరియా ,చికెన్ గునియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలి ప్రజలు అల్లాడుతున్నారని పేర్కొన్నారు.జ్వర పీడితులుగా ప్రతి ఇంట్లో ఒకరు ఉన్నారని వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం, వైద్య ,ఆరోగ్య శాఖ అధికారులు వైద్య బృందాలను ఏర్పాటు చేసి రోగులకు కావాల్సిన మందులు, వైద్య పరీక్షలు విస్తృతంగా చేపట్టాలని వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచి ప్రజలందరికీ యుద్ధప్రాతిపదికన వైద్య సహాయం చేయాలని డిమాండ్ చేశారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా 24 గంటలు ప్రజలకు వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని కోరారు.జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ గా ప్రకటించి ప్రజలందరికీ వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని కోరారు.ప్రభుత్వం నుండి ప్రజలకు వైద్య సహాయం అందకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని,దీని మూలంగా పేద ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం తక్షణమే సంచార వైద్య బృందాల ద్వారా ప్రజలందరికీ వైద్యం అందించాలని కోరారు.లేని పక్షంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు,పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో ఆ సంఘ జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్యం , జిల్లా సహాయ కార్యదర్శి నల్లమేకల అంజయ్య తదితరులు పాల్గొన్నారు