Thursday, 5 November 2026

వీధి కుక్కల స్వైర విహారం

వీధి వీధినా గుంపులు గుంపులుగా దర్శనం. బెంబేలెత్తిపోతున్న  ప్రజానీకం
జుక్కల్, అక్టోబర్ 14,( జనం సాక్షి) : జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం, నిజాంసాగర్, పెద్ద కొడప్ గల్, బిచ్కుంద, మద్నూర్, డోoగ్లి, జుక్కల్ మండలాల్లోని అన్ని గ్రామాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నియోజక వర్గం పరిధిలోని ఏ రోడ్డులో చూసిన కుక్కలు గుంపులు గుంపులుగా దర్శనమిస్తున్నాయి. పాఠశాలలకు వెళ్ళే చిన్నారులు వీటి వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రిపూట ద్విచక్ర వాహనదారుల వెంటపడి మరీ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని వాటిని తొలగించాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. పట్టపగలు జన సంచారం ఉన్న ప్రాంతాల్లో మనుష్యుల మీద పడి కరుస్తున్నాయని వాపోతున్నారు. రాత్రి సమయాలలో వీటి ఆగడాలకు హద్దు, ఆదుపు లేకుండా పోతున్నాయన్నారు. వీధి కుక్కలు బురద లో, మురికి కాలువలో దొర్లి శరీరమంతా మురికి అంటించుకుని గ్రామాల్లో ఇండ్లవద్ద కూర్చుని మురికి చేస్తున్నాయి. అలాగే కుళ్లిపోయిన ఆహార పదార్థాలు, కుళ్ళిన మాంసాన్ని, బొక్కలను జనసంచార ప్రాంతాల్లోకి తీసుకు వచ్చి తిన్నంత తిని మిగిలింది అక్కడే వదిలి పెడుతున్నాయి. దీంతో ఆ ప్రదేశమంతా అపరిశుభ్రంగా తయారయి రోగాలకు కారణ మవుతున్నాయి. ఈ కుక్కలకు కడుపు నిండా ఆహారం లేక క్రూరంగా ప్రవర్తిస్తున్నాయి. తలుపులు తెరచి ఉన్న ఇళ్ళల్లో చొరబడుతున్నాయి. వెల్లగొడితే మీదపడి కరుస్తున్నాయి. కుక్కలు కాటువెస్తే ప్రాణాంతక మయిన రేబిస్ వ్యాధి సోకి మరణించే అవకాశాలు ఉన్నాయి. గత ఆరునెలల కాలంలో బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రిలో 130మంది, పెద్ధ కొడప్గల్ ప్రభుత్వ ఆసుపత్రిలో 62మంది  కుక్క కాటుకు గురైనవారు చికిత్సపొందారు. అలాగే
గ్రామాల్లో రోజురోజుకి కుక్కల సంఖ్య వేగంగా పెరుగుతోంది.అత్యవసర పనులపై బయటకు రావాలంటే ప్రజలు భయాందోళనకు గురి కావలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని  వీధి కుక్కల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలన ప్రజలుకోరుతున్నారు.