Saturday, 7 November 2026

వెనక్కు తగ్గారు!

– రెబల్స్‌ను బుజ్జగించిన పార్టీలు

– అధిక శాతం ప్రధాన పార్టీల్లో రెబెల్స్‌ నామినేషన్ల ఉపసంహరణ

– ఊపిరిపీల్చుకున్న స్థానిక నేతలు

హైదరాబాద్‌, నవంబర్‌22(జ‌నంసాక్షి) :రెండు రోజులు క్రితం ఆయా పార్టీల నుంచి టికెట్‌ రాకపోవటంతో రెబల్స్‌ గా నామినేషన్లు దాఖలు చేసిన వారిని విరమించుకొనేలా పార్టీల అధిష్టానాలు బుజ్జగింపులు చేశాయి. దీంతో రెబల్స్‌ వద్దకు వెళ్లి పార్టీల ముఖ్యనేతలు మంతనాలు జరిపారు. దీంతో మెత్తపడ్డ రెబల్స్‌ అభ్యర్ధులు పార్టీ నిర్ణయం మేరకు తాము నడుచుకుంటామని, పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని ప్రకటించారు. అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు ఆయా పార్టీలు చేసిన ప్రయత్నాలు సైతం ఫలితాలనిచ్చాయి. ఇదిలా ఉంటే పలువురు స్వతంత్య్ర అభ్యర్ధులుసైతం తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. గురువారంతో నామినేషన్ల ఉపసంహరణల గడువు ముగియడంతో గురువారం ఉదయం నుంచే రెబల్స్‌ అభ్యర్ధులు, స్వతంత్ర అభ్యర్ధులతో ఆయా పార్టీల ముఖ్యనేతలు

సమావేశాలు విరమించుకొనేలా చేశారు. దీనిలో భాగంగా కోదాడ నియోజకవర్గంలో తెరాస రెబెల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన శశిధర్‌ రెడ్డి నామినేషన్‌ ఉపసంహరణకు అంగీకరించారు. ఈ మేరకు

మంత్రి కేటీఆర్‌ని హైదరాబాద్‌లో కలిశారు. సముచిత స్థానం కల్పించడంతోపాటు ఎమ్మెల్యే స్థాయికి తగ్గకుండా రాబోయే ప్రభుత్వంలో గౌరవ ప్రథమైన స్థానం కల్పిస్తామని మంత్రి హావిూ ఇవ్వడంతో ఆయన వెనక్కి తగ్గారు. అదేవిధంగా కోదాడలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన వేణుమాధవ్‌ సైతం తన నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. వేణుమాధవ్‌ నామినేషన్‌ దాఖలు తేదీ తొలిరోజు నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు అందజేశారు. అవి చెల్లుబాటు కాకపోవటంతో నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. అయితే నామినేషన్‌ల చివరిరోజు 19వ తేదీన మళ్లీ వేణుమాదవ్‌

నామనేషన్‌ ను దాఖలు చేశారు. కాగా గురువారం విత్‌డ్రాలకు తుదిగడువు కావడంతో ఆయన్ను విరమింప జేశారు. అదేవిధంగా మిర్యాలగూడలో కాంగ్రెస్‌ రెబెల్‌ అభ్యర్థి అలుగుబెల్లి అమరేంద్రరెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. పార్టీ అభ్యర్థి ఆర్‌.కృష్ణయ్యతో కలిసి ఆర్డీవో కార్యాలయానికి వచ్చి నామినేషన్‌ వెనక్కి తీసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ అసంతృప్త నేతలు వెనక్కి తగ్గారు. కాంగ్రెస్‌ రెబెల్‌గా నామినేషన్‌ వేసిన ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల అసమ్మతి నేతలు సుభాష్‌ రెడ్డి, మాల్యాద్రిరెడ్డి తమ నామినేషన్‌ ఉపసహరించుకునేందుకు సమ్మతించారు. కామారెడ్డి మండలం లింగాపూర్‌ గ్రామంలో అసమ్మతి నేతలతో కాంగ్రెస్‌ శాసనమండలి పక్ష నేత షబ్బీర్‌ అలీ, మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి చర్చించారు. ఎల్లారెడ్డి నుంచి సుభాష్‌ రెడ్డి, బాన్సువాడ నుంచి మాల్యాద్రిరెడ్డి నామినేషన్‌ వేశారు. ఉపసంహరణ కోసం నేతలు మంతనాలు జరపగా.. చివరకు నామినేషన్‌ ఉపసంహరణకు సమ్మతించారు. పార్టీలో టికెట్లు త్యాగం చేసిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని షబ్బీర్‌ అలీ, సుదర్శన్‌ రెడ్డి చెప్పారు.

అదేవిధంగా చేవెళ్లలో కాంగ్రెస్‌ రెబెల్‌ అభ్యర్థి పడాల వెంకట స్వామి సైతం వెనక్కి తగ్గారు. తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రత్నంకు మద్దతు ఇస్తానని ప్రకటించారు.

మేడ్చల్‌ కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి జంగయ్యయాదవ్‌ కూడా తన నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు.

కుత్బుల్లాపూర్‌ తెరాస రెబల్‌ అభ్యర్థి హనుమంత రెడ్డి నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌ రెడ్డి వరంగల్‌ పశ్చిమ స్థానానికి వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. మహాకూటమిలో భాగంగా వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గాన్ని తెదేపాకు కేటాయించారని, పార్టీ సూచన మేరకు తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నానని విూడియాకు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. కూటమి తరఫున ప్రచారం చేస్తానని, తెదేపా అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌ రెడ్డికి మద్దతిస్తానని పేర్కొన్నారు. ఇలా మరికొన్ని జిల్లాల్లో రెబల్స్‌ను బుజ్జగించిన ఆయా పార్టీల అధిష్టానాలను ఓటింగ్‌ క్రాస్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి.