Tuesday, 3 November 2026

వేటు ఖాయమా..!

– రేవంత్‌పై వేటుకు టీడీపీ నేతల పట్టు
– చంద్రబాబుకు తాజా అంశాలతో వివరణ పంపిన నేతలు
– బాబు విదేశీటూర్‌ నుంచి వచ్చేలోపే వేటువస్తారని జోరుగా ప్రచారం
– ఆందోళనలో రేవంత్‌ శిబిరం
– బాబుకు వివరణ ఇచ్చాకే తన నిర్ణయం ఉంటుందంటున్న రేవంత్‌
హైదరాబాద్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి) : తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిపై వేటు పడబోతుందా..? ఇప్పటికే మోత్కుపల్లి బృందం చంద్రబాబుకు తాజా పరిణామాలపై నివేదికను పంపించిందా..? బాబు విదేశాల నుంచి వచ్చేలోపే రేవంత్‌ను పార్టీని బహిష్కరించేందుకు కసరత్తు జరుగుతుందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.. ఇటీవల రేవంత్‌ రెడ్డి ఏపీ మంత్రులు, టీడీపీ నేతలపై ఆరోపణలు గుప్పించిన విషయం విధితమే. అప్పటి నుండి రేవంత్‌ వర్సెస్‌ టీడీపీ ఏపీ నేతలు, తెలంగాణ నేతలు అన్నట్లుగా మాటల యుద్ధం సాగుతోంది.. శుక్రవారం నిర్వహించిన తెలంగాణ పొలిట్‌బ్యూరో సమావేశంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డిపై టీటీడీపీ నేతలు మోత్కుపల్లి, అరవింద్‌ కుమార్‌ గౌడ్‌లతో పాటు పలువురు నేతలు మండిపడ్డారు. అసలు ఎవరిని అడిగి రాహుల్‌ను కలిశావు.. ఏపీ మంత్రులపై ఎవర్ని అడిగి ఆరోపణలు చేశావు.. నీకు అదిష్టానం అంటే గౌరవం లేదా అంటూ నిలదీశారు. దీంతో రేవంత్‌ వర్సెస్‌ మోత్కుపల్లి అన్నట్లుగా ఈ సమావేశం జరిగింది. రేవంత్‌ సైతం ఎక్కడా వెనక్కు తగ్గకపోవటంతో పాటు నేను ఎవరికి సమాదానం చెప్పాల్సిన అవసరం లేదు.. చంద్రబాబు వచ్చాకే తన వివరణ ఇస్తా అంటూ ఖరాఖండీగా చెప్పారు.. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మోత్కుపల్లి, అరవింద్‌గౌడ్‌లతో పాటు పలువురు నేతలు సమావేశం నుంచి బయటకు వచ్చేరు. దీంతో అప్పటి నుండి టీడీపీ నేతలు వర్సెస్‌ రేవంత్‌రెడ్డిగా తెలంగాణ టీడీపీ విడిపోయింది.. ఇదిలా ఉంటే శనివారం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి తనవెంట వచ్చే వారిపేర్లను రాహుల్‌కు ఇచ్చారంటూ ప్రచారం జరిగింది. ఈ పేర్లను పలు విూడియాల్లో ప్రసారమయ్యాయి. దీంతో టీతెదేపా నేతలు విలేకరుల సమావేశం నిర్వహించి పార్టీ
మారుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు వెంటనే స్పందించాలని, విూడియా ద్వారా వాటిని ఖండించాలని ప్రకటించారు.. అయినా రేవంత్‌ స్పందించక పోవటం మిగిలిన నేతల్లో ఆగ్రహాన్ని తెప్పించింది.. కాగా ఆదివారం కొడగల్‌లో తన వర్గీయులతో సమావేశమైన రేవంత్‌రెడ్డి పార్టీ మారేది లేదని, తమ అధినేత చంద్రబాబు వచ్చిన తరువాత బాబుతో బేటీ అయ్యి తన నిర్ణయాన్ని తెలియజేస్తానని స్పష్టం చేశారు. అయినా ఈ వివరణపై టీతెదేపా సీనియర్‌ నేతలు సంతృప్తి చెందలేదని తెలుస్తోంది..
వేటే వేయాల్సిందే..
ఆదివారం టీతెదేపా పొలిట్‌బ్యూరో సమావేశం మరోసారి జరిగింది. ఈ సమావేశానికి రేవంత్‌రెడ్డికి ఆహ్వానం లభించలేదు. రేవంత్‌రెడ్డి వ్యవహారంపై చంద్రబాబుకు నివేదిక పంపాలని టి.టీడీపీ పొలిట్‌బ్యూరో తీర్మానం చేసింది. పార్టీ మారుతున్నట్టు ప్రచారం జరుగుతున్నవారి పేర్లతో జాబితాను సిద్ధం చేసిన టీడీపీ నేతలు ఆ జాబితాను చంద్రబాబుకు పంపించారు. పార్టీ మారడంపై కొడంగల్‌లో రేవంత్‌ ఇచ్చిన వివరణతో సీనియర్లు సంతృప్తి చెందలేదని ఈ పరిణామాలతో స్పష్టమవుతోంది. దీంతో రేవంత్‌పై తక్షణమే వేటువేయాలని మోత్కుపల్లి బృందం డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. వీలుంటే చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగానే రేవంత్‌రెడ్డిపై వేటు వేస్తారని ప్రచారం జోరగా సాగుతోంది.
ఆగ్రహంతో ఇరు ప్రాంతాల నేతలు..
తమ పై తీవ్ర విమర్శలు చేసిన ఏపీ మంత్రులు, నేతలు రేవంత్‌ తీరుపై ఆగ్రహంతో ఊగిపోతున్నట్లు తెలుస్తోంది.. చంద్రబాబు ఆదేశాలతో మౌనంగా ఉంటున్నప్పటికీ రేవంత్‌ను ఎంత త్వరగా పంపిస్తే అంత మంచిది అన్నట్లు టీటీడీపీ నేతలకు సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో చంద్రబాబు వద్ద ఏపీ నేతలు సైతం రేవంత్‌తీరుపై అగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. పార్టీలో ఉంటూ మాపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు, మమ్మల్ని ఇబ్బందులు పెట్టేలా రేవంత్‌ తీరు ఉందని, ఇలాంటి వారిని పార్టీలో కొనసాగిస్తే ఎప్పటికైనా తమకు ఇబ్బందేనన్న సంకేతాలను చంద్రబాబుకు పంపించినట్లు ప్రచారం జరుగుతుంది. దీనికితోడు రేవంత్‌ వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ స్పందించి రేవంత్‌ తీరుపు తప్పుపట్టారు. స్నేహం ముసుగులో రాజకీయాలు చేసే ఇలాంటి నేతలు కూడా ఉంటారా… అని భయమేస్తుందని పేర్కొన్నారు. దీంతో రేవంత్‌ అత్యంత ప్రీతిపాత్రులుగా ఉన్న కేశవ్‌లాంటి వారుసైతం రేవంత్‌ను సాగనంపితేనే బెటర్‌ అనే ఉద్దేశంలో ఉండటంతో అటు ఏపీ నేతలు, ఇటు టీటీడీపీలోని మోత్కుపల్లి బృందం రేవంత్‌ను వెంటనే తొలగించాలని చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది.. వీలుంటే చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి వచ్చేలోపే ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని పేర్కొన్నట్లు సమాచారం. చంద్రబాబును కలిసి వివరణ ఇచ్చే అవకాశం లేకుండా చేసి రేవంత్‌ తనకు తానుగా పార్టీ మారటం కంటే పార్టీ నుంచి బహిష్కరించేలా చేయటమే మంచిదన్న అభిప్రాయంలో రేవంత్‌ వ్యతిరేఖ వర్గీయులు ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ వ్యవహారంతో రేవంత్‌ వర్గీయులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇదిలా ఉంటే రేవంత్‌ మాత్రం చంద్రబాబు వచ్చాక తనను కలిసి తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఇప్పటికే స్పష్టం చేశారు.. మొత్తానికి చంద్రబాబు వచ్చాక ఈ వ్యవహారానికి తెర పడుతుందా.. రాక ముందే రేవంత్‌ను పార్టీ నుంచి బహిష్కరించేలా చేసి ఈ వ్యవహారానికి తెరదించుతారా అనేది ఆసక్తికరంగా మారింది.