Tuesday, 3 November 2026

వేసవి మంచినీటి సరఫరాకు కసరత్తు

ఇక్కట్లు లేకుండా ఉన్ననీటిని వాడుకునే యత్నం

హైదరాబాద్‌,జనవరి25(జ‌నంసాక్షి): మిషన్‌ భగీరథకు ముందే జంటనగరాల్లో ప్రణాళికాబద్ధమైన నీటి సరఫరాకు జలమండలి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ఉన్న వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం రోజు విడిచి రోజు గంటన్నర నుంచి రెండున్నర గంటల పాటు నీటి సరఫరా చేస్తున్నారు. నిత్యం నీటి సరఫరాలో కూడా గంట నుంచి రెండు గంటలపాటు నీటిని వదులుతారు. 200 మురికివాడల్లోని 50 వేల కుటుంబాలకు రోజూ నీటి సరఫరా ద్వారా తాగునీరందించాలన్నది అధికారుల ఆలోచన. దీనికి సంబంధించిన పనులను దశల వారీగా అమలులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. నీటి వృథా కాకుండా.. కలుషిత నీటి సరఫరాకు అడ్డుకట్ట వేసేలా.. పౌరుల అవసరాలకు సరిపడా నీటిని అందించేందుకు కసరత్తు చేస్తోంది. నిరంతర నీటి సరఫరా చేయాలంటే లీకేజీలు లేని సరఫరా నెట్‌వర్క్‌తోపాటు.. అదే స్థాయిలో డ్రైనేజీ పైపులైన్‌ వ్యవస్థ ఉండాలి. లేని పక్షంలో మురుగు సమస్య మరింత పెరుగుతుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని పనులు చేస్తున్నారు. గత సంవత్సరం వేసవికి ముందే జంట జలాశయాలు, సింగూరు, మంజీరాల నుంచి నీటి రాక గణనీ యంగా తగ్గింది. మార్చి, ఏప్రిల్‌ నాటికి పూర్తిగా నిలిచిపోయింది. అదే సమయంలో కృష్ణా మూడో దశ, గోదావరి నీళ్లు అందుబాటులోకి రావడంతో నగరం దాహార్తి తీరింది. ప్రస్తుతం జంట జలాశయాలతోపాటు, సింగూరు, మంజీరా నదుల్లో అంతంతమాత్రంగానే నీరు ఉంది. అయినా భవిష్యత అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆయా వనరుల నుంచి నిర్ణీత స్థాయి కంటే తక్కువ నీటిని డ్రా చేస్తున్నారు. వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని బోర్డు అధికారులు చెబుతున్నారు. భవిష్యత్‌ వేసవిలో రెండుమూడు నెలలు కీలకం. దీంతో అదుకు తగ్గట్లుగా ప్రణాళిక రూపొందిస్తున్నారు.