Tuesday, 3 November 2026

వ్యక్తిగత మరుగుదొడ్లకు ఆర్థిక సాయం

ప్రజలంతా ఉపయోగించుకోవాలి: ఎంపి నగేశ్‌

ఆదిలాబాద్‌,జూలై4(జ‌నం సాక్షి ): స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు చెల్లిస్తున్నాయని ఎంపీ గోడం నగేశ్‌ చెప్పారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగొడ్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పట్టణంలో కొన్ని వార్డులు మాత్రం ఓపెన్‌ డిఫికేషన్‌ ఫ్రీ (ఓడీఎఫ్‌)గా ప్రకటించారన్నారు. అధికారులు గ్రామాల్లోకి వెళ్లి మరుగుదొడ్డి ఆవశ్యకతపై అవగాహన కల్పించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని దవాఖానలు, పీహెచ్‌సీల్లో వైద్యుల కొరత ఉంటే ఖాళీల జాబితాను అందజేయాలని అన్నారు. జిల్లా వైద్యాధికారి ప్రతిరోజూ దవాఖానలను సందర్శిస్తూ రోగులకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకోవాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీని చేపట్టాలనిఅధికారులకు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తూ అర్హులకు అందేలా చూసే బాధ్యత అధికారులదేనని అన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే బాధ్యత అధికారులపై ఉందన్నారు. గతంలో సాగు భూముల నుంచి మట్టి నమునాలను సేకరించి కార్డులను అందజేశారని, ఏ భూమిలో ఎంత మోతాదులో ఎరువులు వాడాలి, ఏ విత్తనాలు వేసుకోవాలో రైతులకు అవగాహన కల్పించి అధిక దిగుబడులు సాధించేలా వ్యవసాయశాఖ అధికారులు చూడాలన్నారు. గ్రామాల్లో పాఠశాల తరగతి గదులు నిర్మాణ దశలో ఉన్నాయని, పనులను వేగవంతం చేసి వినియోగంలోకి తీసుకరావాలన్నారు.