Monday, 2 November 2026

వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు అపార అవకాశాలు-పోచారం

రుద్రూరు,ఆగస్టు30 : వ్యవసాయ రంగం అభివృద్ది కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృఢ సంకల్పంతో ముందుకెళుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. సంకల్ప బలంతోనే అభివృద్ధిని, అద్భుతాలను సాధించవచ్చని ఆయన తెలిపారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించారు. బుధవారం నిజామాబాద్‌ జిల్లా రుద్రూరు లో రూ. 16 కోట్లతో నూతనంగా నిర్మించిన తెలంగాణ మొదటి ఆహార శాస్త్ర సాంకేతిక విజ్ఞాన కళాశాల భవనాలను రాష్ట్ర మంత్రి పోచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు పది వేళ్ళు భూమి విూద పెడితేనే ప్రజల ఐదు వేళ్ళు నోట్లోకి వెళతాయన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక విభజనలో వ్యవసాయ కళాశాల తెలంగాణకు, ఉద్యాన కళాశాల ఆంధ్ర ప్రాంతానికి కేటాయించిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ గౌరవంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టామని తెలిపారు. దేశంలో మొత్తం 12 ఫుడ్‌ సైన్స్‌ కళాశాలలు ఉండగా 13వ కాలేజీని తెలంగాణలో మొదటిగా నిజామాబాద్‌ జిల్లా రుద్రూరు చేశామన్నారు. కేబినెట్‌ సమావేశంలో అజెండాను ప్రవేశపెట్టి ఈ కళాశాలను స్థాపించడానికి అనుమతిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు పోచారం కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల్లో రోడ్ల అభివృద్ధికి రూ. 300 కోట్లు కేటాయిస్తే, నేడు తెలంగాణలో ఒక్కో నియోజకవర్గానికే రూ. 300 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల కోసం రూ. 40 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు. వచ్చే బతుకమ్మ పండగకి రాష్ట్రంలోని కోటి అయిదు లక్షల మంది మహిళలకు చీరలను పంపిణీ చేయబోతున్నామని చెప్పారు. విద్యారంగ అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. సమైక్య రాష్ట్రంలో 65 సంవత్సరాల పాలనలో 200 గురుకులాలు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన మూడేళ్ళలో 520 నూతన గురుకులాలను స్థాపించామన్నారు. దేశంలో అత్యంత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం వ్యవసాయమని చెప్పారు. రాష్టాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి నాలుగు కోట్ల మంది ప్రజల మొహాలలో చిరునవ్వు చూడటమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎపీ బీబీ పాటిల్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దఫేదార్‌ రాజు, వైస్‌ చాన్సలర్‌ ప్రవీణ్‌ రావు,

నిజామాబాద్‌ ఇంచార్జ్‌ కలెక్టర్‌ ఎ. రవీందర్‌ రెడ్డి, బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.