తాండూరు,,ఆగష్టు 30,(జనంసాక్షి): వికారాబాద్ జిల్లా తాండూరులో తెరాస కార్యకర్తల సమావేశంలో కలకలం చోటుచేసుకుంది. మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలోనే తాండూరు పట్టణ తెరాస మాజీ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించడం సంచలనమైంది. గత కొంతకాలంగా పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు, కార్యకర్తల మధ్య సయోధ్య కుదిర్చేందుకు మంత్రి మహేందర్‌రెడ్డి ఈ రోజు సమావేశం ఏర్పాటుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పనిచేసిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వడంలేదంటూ ఆయూబ్ ఖాన్ ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ సమావేశంలోనే ఆయూబ్‌ఖాన్ తనకు పార్టీలో న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తంచేస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆయనను హుటాహుటిన అంబులెన్స్‌లో సవిూపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, 60 శాతానికి పైగా శరీరానికి గాయాలు కావడంతో మెరుగైన చికిత్సనిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఆయనను తరలిస్తున్న వాహనం వెంటే మంత్రి మహేందర్‌రెడ్డి కూడా బయల్దేరి వెళ్లారు. ప్రస్తుతం ఆయూబ్ ఖాన్ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో తాండూరు పట్టణంలో ఆయూబ్‌ఖాన్ వర్గీయులు రాస్తారోకో చేపట్టారు.




