Wednesday, 4 November 2026

వ్యవసాయ మార్కెట్ల ప్రక్షాళనతోనే రైతుకు మేలు 

దళారీ వ్యవస్థ ఎత్తివేతకు సంస్కరణలు తేవాలి
కఠిన చర్యలతోనే రైతుకు లాభం చేకూరగలదు
హైదరాబాద్‌,మే7(జ‌నం సాక్షి): ఎన్ని చర్యలు తీసుకున్నా రైతులకు మద్దతు ధరలు దక్కడంలో మళ్లీ దళారులదే పైచేయి అయిపోతోంది. సిసిఐ,మార్క్‌ఫెడ్‌ తదితర సంస్థలు పక్కాగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నా వారి పాత్ర తగ్గడం లేదు. రైతులు  కూడా త్వరగా పంట అమ్ముకోవాలన్న ఆత్రుతలో వారినే ఆశ్రయిస్తున్నారు. పంటలకు గిట్టుబాటుధరలు రావడం ఒక ఎత్తయితే వచ్చిన పంటలను మార్కెట్‌కు తీసుకుని వెళితే దళారుల చేతిలో మోసపోవడం మరో ఎత్తు. మార్కెట్ల, దళారుల మాయా జాలంలో రైతులు ఏటా నష్టపోతూనే ఉన్నారు. మార్కెట్లను సంస్కరించి గిట్టుబాటు ధరలు అందించి, దళారుల దోపిడీ నుంచి విముక్తి కల్పిస్తే తప్ప ప్రయోజనం ఉండదు. ధాన్యం చేతికి వచ్చే వేళ మార్కెట్లలో హడావిడి చేస్తున్నారే తప్ప ఫలితం కానరావడం లేదు. ప్రధానంగా మార్కెట్‌ కమిటీలు కూడా దళారులతో చేతులు కలపడం వల్లనే ఇలా జరుగుతోంది. మార్కెట్‌ కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చినా వారు కూడా గట్టిగా రైతుల పక్షాన నిలబడి పోరాడడం లేదు. వారి వెనకా భర్తలు పెత్తనం చెలాయించడంతో రైతులకు బాధలు తప్పడం లేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు వ్యాపారు లకే పంట ఉత్పత్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. పంటల ధరలు పడిపోవడంతో మద్దతు ధరతో కొనుగోళ్లు, కేంద్రాల ఏర్పాటు, తదితర వాటిపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు సవిూక్ష చేయడం, మంత్రులు వచ్చి వెళ్లడం చేస్తున్నా పరిస్తితుల్లో మార్పులు కానరావడం లేదు. పంట ఉత్పత్తుల క్రయ విక్రయాల్లో రైతులకు ఎదురవుతున్న సమస్యలపై చర్చించి సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలా జరగుతోంది. దీనికితోడు దళారీలకు భయం లేకుండా పోయింది. ఇందుకు ముందుగా మార్కెట్లను సంస్కరించాలి. అందులో ఉద్యోగులకు, వ్యాపారులకు, మార్కెట్‌ కమిటీలకు సరైన నిబంధనలు విధించాలి. సిసి కెమెరాల ద్వారా మొత్తం వ్యవహారాలను రాజధానితో అనుసంధానం చేయాలి. రైతులకు మేలు చేసే క్రమంలో ఎంతటి కఠినమైన నిబంధనలు అయినా తీసుకోవాలి. ఇందుకు ప్రభుత్వం ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలి. అప్పుడే రైతులకు గిట్టుబాటు ధరలు వస్తాయి. పండించిన పంటలను అమ్ముకోవడం ఓ యజ్ఞంగా మారింది.  ఇకపోతే అదేమి విచిత్రమో గానీ పంట ఉత్పత్తులు చేతికి రాగానే ధరలు పడిపోతుంటాయి. ధరలు సామాన్యులు బాధపడుతుంటే ధరలు దక్కడం లేదని రైతులూ బాధపడుతున్నారు. మధ్యలో దళారులు మాత్రం పండగ చేసకుంటున్నారు. ఈ- నామ్‌ ప్రవేశ పెట్టినా, రైతు సమన్వయ సమితులు వచ్చినా రైతుల గోస దీరడం లేదు. మార్కెట్ల ప్రక్షాళన జరిగి, రైతులు తమ పంటలకు తామే ధరలు నిర్ణయించుకునేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మార్కెట్‌ మాయాజాలంతో రైతులు ఏటా దగా పడక తప్పడం లేదు.  ప్రస్తుతం బహిరంగ మార్కెట్ల లో పంట ఉత్పత్తుల ధరలు మద్దతు ధరలకంటే తక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో ప్రభుత్వరంగ సంస్థల కొనుగోలు చేస్తేనే రైతులకు కనీసం మద్దతు ధర అయిన దక్కే అవకాశముంది. క్రయవిక్రయాలపై  ప్రధానంగా కొనుగోళ్ళలో ఉన్న నిబంధనలు, కేంద్రాల ఏర్పాటు, సౌకర్యాలు, తదతర వాటిపై చర్చించి రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరముంది. లోపభూయిష్టమైన ప్రభుత్వ విధానాలు ఇందుకు కారణమవుతున్నాయి. మద్దతుధరతో పంటలను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ప్రకటనలిస్తున్నారే తప్ప సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కారానికి చొరవ చూపడం లేదు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్న అధికారులు వాటిని సక్రమంగా అమలయ్యేలా చొరవచూపడం లేదు. రైతులను మోసం ఏస్తే అరదండాలు తప్పవన్న భయం లేకుండా పోయింది. రైతుల సాధక బాధలు తెలుసుకోని వాటిని పరిష్కరిస్తేనే  రైతులకు మేలు జరుగుతుంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వీలుగా జాతీయ స్థాయిలో నామ్‌ పద్దతిన కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసినా ఏ మార్కెట్‌లోనూ సక్రమంగా  అమలుకు నోచుకోవడం లేదు. ఇందులో ఉండే ఇబ్బందులు తొలగించి
ఈ-నామ్‌ పద్ధతి పాటిస్తే రైతులకు కొంత మేలు జరిగే వీలుంది. దీనికితోడు సెంట్రల్‌ కమాండ్‌ సిస్టమ్‌ అమల్లోకి వచ్చినందున రాజధానికి మార్కెట్లను అనుసంధానం చేయాలి. ఎక్కడెక్కడ ఏ పంట మార్కెట్‌కు వచ్చిందీ, ఎంత వచ్చిందీ తెలుసుకోవాలి. ఆనాటి ధరల ప్రకారం చెల్లించేలా చూడాలి. అలాగే రైతులు ఒకేసారి పంటలను మార్కెట్లలోకి తీసుకుని రాకుండా గ్రామాల్లో ప్రచారం చేయాలి. లేదా ఆయా గ్రామాల వారు ఏ మార్కెట్‌కు ఏ రోజు పంటలను తరలించాలో ప్రచారం చేయాలి.