Tuesday, 3 November 2026

వ్యవసాయ యంత్రాల కోసం దరఖాస్తు చేసుకోండిలా…

హైదరాబాద్: పంటల సాగులో అధునిక యంత్రాలను ఉపయోగించేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం యాంత్రికరణ పథకానికి భారీగా నిధులు కేటాయించింది. మండల కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకుంటే అవకతవకలు జరుగుతున్న నేపథ్యంలో రైతులు మీ సేవా ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. దీని ద్వారా పథకం అమలుతో పారదర్శకంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం సరఫరా చేసే యంత్ర పరికారాల ధరలు మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. కావాల్సిన పరికరంతో పాటు ఇష్టమున్న కంపెనీని సూచిస్తూ మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకోవడం ఇలా….
* యాంత్రీకరణ పథకం కింద పరకరాలు కావాలనుకునే రైతులు ముందుగా నిర్ణీత దరఖాస్తు ఫారం నింపాలి.
* దానికి పట్టా పాసు పుస్తకం జిరాక్స్, ఆదార్ కార్డు జిరాక్స్, బ్యాంకు పాసు పుస్తకం జిరాక్స్‌ను జతచేయాలి.
* ఈ పత్రాలతో స్థానిక మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. పత్రాలు పరిశీలించి వాటిపై సంతకం చేసి వ్యవసాయ అధికారి పత్రాలు మనకు తిరిగి ఇస్తారు.
* ఆ పత్రాలు తీసుకెళ్లి స్థానికంగా ఉన్న మీ సేవా కేంద్రంలో ఆన్‌లైన్లో నమోదు చేసుకోవాలి.
* మీ సేవా కేంద్రంలో నమోదు అనంతరం మీ సేవా నిర్వహకులు మనకు రసీదు ఇస్తారు. ఆ రసీదును ఆన్‌లైన్‌లో నమోదు చేసిన పత్రాలతో జత చేసి వ్యవసాయ అధికారికి అందజేయాలి.
* ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఏడీకి, తర్వాత జేడీకి పంపిస్తారు.
* జేడీ దరఖాస్తులు పరిశీలించి ఉత్తర్వులు మంజూరు చేస్తారు. అనంతరం ఎంపికైన రైతులకు మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయం నుంచి పరికరాల పంపిణీ చేస్తారు.
* ట్రాక్టర్ కొరకు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ రైతులకు 95 శాతం రాయితీ ఉండగా, ఇతర రైతులకు 50 శాతం రాయితీ ఉంటుంది.
* ట్రాక్టర్లు మినహా ఇతర పరికరాల విషయంలో ఎవరికైనా 50 శాతం రాయితీ వర్తిస్తుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *