అధికారులతో సవిూక్షలో మంత్రి పోచారం
హైదరాబాద్,జూలై7(జనం సాక్షి): ప్రతీ క్లస్టర్‌కు అవసరమైన యంత్రాలను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచే విధంగా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులకు సూచించారు. విత్తనం వేసిన దగ్గర నుండి పంటకోత వరకు అన్ని పనులు యంత్రాలతోనే జరిగే విధంగా యంత్రీకరణ ఉండాలన్నారు. దీనివల్ల సాగుఖర్చు తగ్గడంతో పాటు కూలీల కొరత నివారణకు ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రతి క్లస్టర్‌లో సేద్యం చేయడానికి ఎన్ని యంత్రాలు అవసరమో వివరాలు రూపొందించాలన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ యంత్రీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ క్రమంలో భాగంగా వ్యవసాయ యంత్రీకరణకు ఈ ఏడాది అధికంగా నిధులను కేటాయించినట్లు మంత్రి తెలిపారు. వానాకాలం పంటలసాగు, వ్యవసాయ యంత్రీకరణ, రైతు వేదికల నిర్మాణంపై వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో మంత్రి పోచారం తన అధికారిక నివాసంలో శనివారం సవిూక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ.. ప్రతి క్లస్టర్ లో రైతు వేదికల నిర్మాణం వేగం పుంజుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రైతు వేదికల నిర్మాణానికి అవసరమైన భూములను గుర్తించాలని సూచించారు. భూములను గుర్తించడంలో రెవిన్యూశాఖ అధికారుల సహాయం తీసుకోవాలన్నారు. రైతు వేదికల
నిర్మాణానికి అవసరమైన నిదులను బడ్జెట్ లో పొందుపరచినందున నిధులకు ఇబ్బందులు లేవని మంత్రి వెల్లడించారు. సవిూక్ష సమావేశానికి వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి. పార్ధసారది, కవిూషనర్ యం. జగన్మోహన్, అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్, జాయింట్ డైరెక్టర్ బాలు నాయక్ హాజరయ్యారు.
——————




