ఫ్రెండ్లీ పోలీసింగ్ కారణమన్న నాయిని
వికారాబాద్,మే25(జనంసాక్షి): దేశంలో శాంతి భద్రతల పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని ¬ంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఫ్రెండలీ పోలీసింగ్ కారణంగా సమస్యలు లేకుండా పోతున్నాయని అన్నారు. పరిగి పట్టణంలో రూ. 30 లక్షల వ్యయంతో నిర్మించిన పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బతుకమ్మ, రంజాన్ వంటి వేడుకలు జరిగినా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని ఇందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ నిదర్శనమన్నారు. రూ. 3కోట్ల వ్యయంతో పరిగిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పోలీసులు ఆరోగ్యంగా ఉండటానికి మౌలిక వసతుల కల్పనతోపాటు ఫిట్నెస్ కోసం జిమ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పోలీస్ శాఖలోనూ 33 శాతం మహిళా రిజర్వేషన్ కల్పిస్తున్నామని, 35వేల మంది మహిళా కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారన్నారు. అన్ని జిల్లాల్లో ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాల సముదాయాల ఏర్పాటు కోసం జిల్లాకు రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. రైతు ఆత్మహత్యల నివారణకు రైతుబంధు పథకం అమలు చేస్తున్నామన్నారు. వికారాబాద్ జిల్లాను ఇతర జోన్లలో కలపకుండా ఉండేందుకు సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. జిల్లా ఇన్‌ఛార్జిమంత్రి, రవాణా శాఖమాత్యులు మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. పరిగి డీఎస్పీ కార్యాలయానికి స్థలం కేటాయిస్తామని, పక్కాభవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలపాలని ఎమ్మెల్యే రాంమోహనరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకుంటే నిరాహార దీక్షకు దిగుతానన్నారు. కార్యక్రమంలో విద్యా, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఛైర్మన్ నాగేంద్రగౌడ్, కలెక్టర్ మహ్మద్ జలీల్, ఎస్పీ అన్నపూర్ణ, ఇన్‌ఛార్జి ఐజీ శివశంకరరెడ్డి, ఎంఎల్సీ యాదవరెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మహేష్ రెడ్డి, సర్పంచ్ విజయమాల, జడ్పీటీసీ సభ్యురాలు పద్మమ్మ, ఎంపీపీ జ్యోతి, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.




