Tuesday, 3 November 2026

శ్రీదత్తగిరి లో భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు..

హాజరైన జిల్లా ఎస్పీ, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, చైర్మన్ మల్కాపురం శివకుమార్
ఝరాసంగం జులై 13 (జనంసాక్షి)జిల్లా లో ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 108 వైరాగ్య శిఖామణి  అవధూత గిరి మహారాజ్ ఆధ్వర్యంలో గురుపౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, గణపతి పూజ, శ్రీ రుద్ర సహిత శ్రీ దత్తాత్రేయ స్వామి అభిషేకం, సామూహిక అనఘా దేవి వ్రతం, మధ్యాహ్నము శ్రీ దత్త యజ్ఞం, పూర్ణాహుతి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం
ఆశ్రమ పీఠాధిపతి మాతృశ్రీ అనసూయమాత, అవధూత గిరి మహారాజ్ వారికి నాణాలతో తులాభారం, గురుపాద పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆశ్రమాన్ని సందర్శించిన ప్రముఖులు
శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం లో నిర్వహించిన గురుపౌర్ణమి వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా ఎస్పీ రమణ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి -సురేష్ మోహన్, డివిజనల్ పంచాయతీ అధికారి-రాఘవ రావ్,ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, జాగృతి రాష్ట్ర నాయకులు బిక్షపతి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆశ్రమ వైదిక పాఠశాల విద్యార్థులు ఆశ్రమ రాజ గోపురం వద్ద పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ జ్యోతిర్లింగాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు, శ్రీ దత్త యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి దత్తగిరి మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ అల్లాడి వీరేశం పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.
అజ్ఞానమనే చీకటిని తొలిగించే శక్తే గురువు
శ్రీ దత్త గిరి మహారాజ్ ఆశ్రమం లో నిర్వహించిన గురుపౌర్ణమి వేడుకలు సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక సభలో  మహంతి డాక్టర్ సిద్దేశ్వర స్వామి,రంజాల్ రాజయోగ ఆశ్రమ పీఠాధిపతి రాచయ్య స్వామి, మాట్లాడుతూ కలం పట్టుకున్నా.. నేర్పేవాడు ఉన్నప్పుడే అందులో మెళుకువలు తెలుస్తాయని ఆ నేర్పించేవాడే గురువని లౌకిక, అలౌకిక, ఆధ్యాత్మిక.. ఇలా ఏ రంగంలో అయినా మనలను నడిపించడానికి గురువు కావాల్సిందేనని అన్నారు, సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కిందని ‘గు’అంటే చీకటి ‘రు’ అంటే దానిని అడ్డగించువాడు. అజ్ఞానమనే చీకటిని తొలిగించే శక్తే గురువుకి దక్కుతుందన్నారు. నాలుగు వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, బ్రహ్మ సూత్రాలు, మహాభారతం, భాగవతం..మానవాళికి అందించిన మహోన్నతుడు జ్ఞాన బ్రహ్మ వ్యాస మహాముని జన్మదినమే గురు పూర్ణిమ సనాతన వైదిక ధర్మానికి ఇది ఒక మహాపర్వదినం అని వారు అభివర్ణించారు.