ఎగువ వర్షాలతో భారీగా వచ్చి చేరుతున్న వరదనీరు
గోదావరి తీరంలో ఆశాజనకంగా ప్రాజెక్టులు
హైదరాబాద్,ఆగస్ట్18(జనం సాక్షి): వర్షాలతో ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంటున్నది. ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్ట్ నుంచి 93 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మరోవైపు గోదావరి తన ఉగ్రరూపాన్ని చూపుతున్నది. ముఖ్యంగా బేసిన్‌లోని ఎస్సారెస్పీకి తొలుత 80 వేల క్యూసెక్కులకు పైగా వరద వచ్చి ఆపై తగ్గింది.ఎస్సారెస్పీలోకి 82.650 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదయింది. రాత్రి 9 గంటల సమయానికి ఇన్‌ఫ్లో 27.540 క్యూసెక్కులకు తగ్గింది. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పరీవాహక ప్రాంతంలో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. మహాదేవ్‌పూర్ మండలంలోని కాళేశ్వరం వద్ద 10.22 విూటర్లకు, ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం వద్ద 8.65 విూటర్లకు గోదావరి నీటిమట్టం చేరుకున్నది. కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులన్నింటికీ భారీ వరద పోటెత్తుతున్నది. నాలుగేండ్ల తరువాత నాగార్జునసాగర్‌కు జలకళ వస్తున్నది. ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి మూడు లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా, దిగువకు లక్ష క్యూసెక్కులకు పైగా విడుదల చేస్తున్నారు. శనివారం ఉదయం ఏ సమయంలోనైనా రెండు గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు దిగువ ప్రాంతాల కలెక్టర్లను కూడా అప్రమత్తం చేశారు. దరిమిలా సాగర్ ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురించాయి. ప్రభుత్వం కూడా ఆయకట్టుకు సాగునీటి విడుదలకు సిద్ధమవుతున్నది. నారాయణపూర్‌కు అక్కడి నుంచి జూరాలకు ఇదే రీతిన వరద వస్తున్నది. శుక్రవారం సాయంత్రం జూరాలకు ఇన్‌ఫ్లో 1.66 లక్షల క్యూసెక్కులకు పెరిగింది.మరోవైపు కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఒకవైపు జూరాల, మరోవైపు సుంకేశుల నుంచి వస్తున్న నీటితో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. జలాశయానికి శుక్రవారం సాయంత్రం 3.19 లక్షల భారీ ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ 215.81 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 182 టీఎంసీల నిల్వకు చేరుకున్నది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, పోతిరెడ్డిపాడు, కల్వకుర్తి అవుట్‌ఫ్లోతో కలిపి మొత్తం 1.02 లక్షల క్యూసెక్కుల జలాలను దిగువకు వదులుతున్నారు. దిగువన ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లకు సూచించారు. కర్నూలు, మహబూబ్‌నగర్, నల్లగొండ, ప్రకాశం, గుంటూరు కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ జలవనరులశాఖ నుంచి సమాచారం పంపించారు. అత్యంత కీలకమైన నాగార్జునసాగర్ జలాశయానికి ఈసారి జలకళ వచ్చినట్లేనని అధికారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. 2014లో చివరిసారిగా సాగర్‌కు భారీ వరద వచ్చి నిండుకుండలా మారింది. గత ఏడాది దాకా శ్రీశైలం వరకే కృష్ణమ్మ పరిమితమైంది. ఈ నేపథ్యంలో శ్రీశైలంలోని నిల్వలను సాగర్‌కు విడుదల చేసుకుని రెండు రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాలు తీర్చుకోవాల్సి వచ్చింది. మళ్లీ నాలుగేండ్ల తరువాత కృష్ణమ్మ శ్రీశైలంను దాటి సాగర్‌వైపు పరుగులు పెడుతున్నది. ఎగువన తుంగభద్ర, ఆల్మట్టి ప్రాజెక్టులకు వస్తున్న వరద ఇలాగే కొనసాగితే కొన్నిరోజుల్లోనే సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు,—–




