Wednesday, 4 November 2026

శ్రీశైలంలో శాకంబరి ఉత్సవాలు

ఘనంగా అమ్మవారికి కూరగాయలతో అంకరణలు

భారీగా తరలివచ్చిన భక్తులు

శ్రీశైలం,జూలై27(జ‌నం సాక్షి): అష్టాదశ శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో శాకాంబరి ఉత్సవం వైభవంగా జరిగింది. శక్తిస్వరూపిణి శ్రీ భ్రమరాంబ దేవికి కూరగాయలతో అలంకరించి ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాన్ని పురస్కరించుకొని భ్రమరాంబ మూలమూర్తి, ఉత్సవమూర్తి, ఆలయ ప్రాంగణాలను 15 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, వివిధ రకాల ఫలాలతో అలంకరణలు చేశారు. ఉత్సవ వేదికపై కొలువుదీరిన అమ్మవారిచెంత బొమ్మల కొలువు తరహాలో శివలింగం, గణపతి ఆకారాలతో పాటు వివిధ పక్షి,జంతు రూపాలను ఫలాలతో తీర్చిదిద్దారు. ఈవో శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు, వేదపండితులు ఉత్సవమూర్తికి వేదమంత్రోచ్ఛరణలతో పూజలు చేశారు. దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించి శాకములను సృష్టించినందున ఆదిపరాశక్తికి ఏటా సంప్రదాయబద్దంగా శాకాంబరి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. చందగ్రహణం కారణంగా మధ్యాహ్నం 2 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేసారు. తిరిగి ఉదయం ద్వారాలు తెరుస్తారు. శాకంబరి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.