Wednesday, 4 November 2026

సంక్రాంతి నిర్ణయంలోనూ భిన్నాభిప్రాయాలు

హైదరాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): సంక్రాంతి పండుగకు ప్రాతిపదికగా దక్షిణాయనం పోయి ఉత్తరాయణానికి భూ చలనంలో మార్పు సంభవించటం అన్నది మన సంస్కృతిలో ఇమిడివుంది. సంక్రాంతి పండుగ తేదీల గురించి పంచాంగ కర్తలలో భిన్నాభి ప్రాయాలున్నట్లు ఇటీవల మరోమారు వెల్లడయ్యింది. ఈ నెల 14న లేదా 15ననా అన్న సంశయాలతో చివరకు 15ననే మకర సంక్రాంతి అని తీర్మానించారు. పండితుల్లో వైరుధ్యాల కారణంగా ఏటా పండగలపై విభేదాలు వస్తున్నాయి. సశాస్త్రీయత లోపించడం మూలాన ఇలా చిక్కులు వస్తున్నాయి. సాధారణంగా సూర్యోదయంతో ఉండే తిథిని లెక్కకట్టి పండగలు చేస్తారు. మన సౌర కుటుంబానికి సూర్యుడు కేంద్రం కాగా పంచాంగాలు భూమిని కేంద్రంగా ఇప్పటికీ భావిస్తున్నాయి. గెలీలియో, కోపర్నికస్‌లు 500 సంవత్సరాలకు పూర్వమే భూకేంద్ర సిద్ధాంతం తప్పని రుజువుపరిచారు. భూమిని సూర్యుని చుట్టూ చలిస్తున్న గ్రహంగా మార్పు చేసుకోవాలి. అది డిశంబర్‌ 22న జరుగుతూ ఉందని ఆధునిక విజ్ఞాన శాస్త్రాలు చెపుతున్నాయి. ఉత్తరాయణం జనవరి 14న కాదు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేనాటికి 23రోజుల ముందుగా ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అంటే జనవరి14నాటికి ‘పుణ్యకాలం’ 23 రోజులకు ముందే గడిచి పోయిదన్నమాట! ప్రభుత్వాలు భూ కేంద్ర సిద్ధాంతం విూద ఆధార పడిన పంచాగకర్తలపైన కాక, ఆధునిక ఖగోళ శాస్త్ర విజ్ఞానాలపై ఆధారపడాలి. పిల్లలకు పాఠాలుగా చెప్పే సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని తానూ నమ్మక పోతుంటే అది బహిరంగంగా ప్రకటించాలి. మన పూర్వీకుల నాటి ఖగోళ శాస్త్రజ్ఞులయిన ఆర్యభట్టు, వరాహమిహిరుడు, బ్రహ్మ గుప్తుడు, భాస్కరాచార్యుడు లాంటివారు పరిమిత పరికరాలతో, భూ కేంద్రంగానే అయినా గ్రహ చలనాలను సాపేక్షంగా నిర్ధారించి స్థూల కాల గణనను చేయగలిగారు. అవి తదనంతర కాలపు శాస్త్రజ్ఞులకు ఆలంబనగా తోడ్పడ్డాయి. అభివృద్ధి చెందుతున్న విజ్ఞాల శాస్త్రాలపై ఆధారపడిన కాల గణన మాత్రమే మరిన్ని నూతన ఆవిష్కరణలతో తన గత కాలపు కొరతలు సవరించుకుంటూ ముందుకు సాగుతుంది. మార్పును నిరాకరించేవి, కొరతలు పూరించుకోలేనివి శాస్త్రాలుగా కాక మూఢ విశ్వాసాలుగా మిగిలిపోతాయి. అందుకే పంచాంగాలను నేటి ఖగోళ శాస్త్ర ఆవిష్కరణల ప్రాతిపదికగా సరిదిద్దుకునేందుకు సిద్ధం కావాలి.