హైదరాబాద్ జూలై 24(జనం సాక్షి)
ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు: మంత్రి కొప్పుల
కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం,అన్ని రంగాల సర్వతోముఖాభివృద్ధికి అంకితభావంతో పాటుపడుతున్నరు: మంత్రి కొప్పుల
దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాం, దేశంలో మరెక్కడా లేని విధంగా 5లక్షల మంది దివ్యాంగులకు పింఛన్లు ఇస్తున్నం: మంత్రి కొప్పుల
తెలంగాణలో దివ్యాంగులు ఆత్మస్థైర్యం,గౌరవంతో ఉన్నరు: వికలాంగుల ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్ వాసుదేవరెడ్డి
24కోట్లతో 17వేల మంది దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు ఉచితంగా అందించినం:వాసుదేవ రెడ్డి
మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని వికలాంగుల ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో నరాల బలహీనత, వెన్నుపూస గాయంతో బాధపడుతున్న 71 మందికి బ్యాటరీ వీల్ ఛైర్స్ అందజేశారు
ఈ కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు
హైదరాబాద్: ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అసలుసిసలు చిరునామా తెలంగాణ రాష్ట్రం అని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని,ప్రజలందరి సంక్షేమానికి, సముద్ధరణకు, అన్ని రంగాల సర్వతోముఖాభివృద్ధికి అంకితభావంతో పాటుపడుతున్నారన్నారు.
మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని వికలాంగుల ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్ డాక్టర్ కె.వాసుదేవ రెడ్డి ఆధ్వర్యంలో నరాల బలహీనత, వెన్నుపూస గాయంతో బాధపడుతున్న 71 మందికి బ్యాటరీ వీల్ ఛైర్స్ అందజేశారు. చాదర్ ఘాట్ వద్ద ఉన్న విక్టరీ ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివ్యాంగుల సమస్యల పరిష్కారం పట్ల కేసీఆర్ సానుకూల దృక్పథంతో ఉన్నారని, వీరి సంక్షేమానికి, ఉన్నతికి దేశంలో మరెక్కడా కూడా లేని విధంగా పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
వీరి సంక్షేమానికి గతంలో ఏటా 5 కోట్ల బడ్జెట్ మాత్రమే ఉండేదని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి సంవత్సరం ఈ బడ్జెట్ ను మరింత పెంచుకుంటూ పోతున్నారన్నారు.
గతంలో నెలకు 500రూపాయల పింఛను ఇవ్వగా, ఇప్పుడు సుమారు 5లక్షల మందికి 3,016చొప్పున పింఛన్లు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఇందుకోసం ఏటా 1,800కోట్ల ఖర్చవుతున్నదని కొప్పుల తెలిపారు. ఆరోగ్య పరిరక్షణకు ప్రతి నెల మెడికల్ కిట్ ఇవ్వాలనే డిమాండ్ ను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి సానుకూలంగా పరిష్కరిస్తానని మంత్రి హామీనిచ్చారు.
దివ్యాంగుల సంక్షేమం విషయంలో ఇతర రాష్ట్రాలలో మంచి కార్యక్రమాలు ఉంటే అధికారులతో కలిసి పరిశీలించి తెలంగాణలో కూడా అమలు చేస్తామన్నారు.ఈ సందర్భంగా ఛైర్మన్ డాక్టర్ కె.వాసుదేవరెడ్డి మాట్లాడుతూ, దివ్యాంగులు ఆత్మ స్థైర్యంతో,గౌరవంతో ముందుకు సాగేలా కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనివిధంగా దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను ఉచితంగా అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఇప్పటి దాక 24కోట్లు వెచ్చించి 17వేల మందికి సహాయ ఉపకరణాలను అందించామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నరాల బలహీనత, వెన్నుపూస గాయంతో బాధపడుతున్న 71 మందికి బ్యాటరీ వీల్ ఛైర్స్, నలుగురు పరిశోధనా విద్యార్థులకు అందజేశారు. అంతకు ముందు సంస్థ ఆవరణలో మంత్రి, ఛైర్మన్ అంధ బాలికలతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో దివ్యాంగుల అడ్వయిజరీ బోర్డు సభ్యుడు నారా నాగేశ్వరరావు, సంస్థ జనరల్ మేనేజర్ ప్రభంజన్ రావు తదితరులు పాల్గొన్నారు.




