Thursday, 5 November 2026

సన్నచిన్నకారు రైతులకు మేలు

పెద్ద రైతులు స్వచ్ఛందగా వెనక్కి
హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి): స్వాతంత్య్రం వచ్చిన 70 ఏండ్లలో ఇప్పటివరకు తెలంగాణలో రైతుకు ప్రభుత్వాల నుంచి భరోసా దొరకలేదు. మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం రైతుకు భరోసా ఇస్తూ పెట్టుబడి పథకాన్ని తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 90.5 శాతం ఉన్న పేద రైతులకు పెద్ద ఉపశమనం కలిగింది. రాష్ట్రంలో ఎక్కువ భూమి ఉన్న పెద్ద రైతులు స్వచ్ఛందంగా పెట్టుబడి పథకం వద్దని వదులుకుంటున్నారు. రాష్ట్రంలో రెండున్నర ఎకరాలలోపు భూమి
ఉన్న చిన్నకారు రైతులు 41 లక్షల మంది ఉన్నారు. రెండున్నర నుంచి 5 ఎకరాల లోపు ఉన్న సన్నకారు రైతులు 11 లక్షల మంది. 4.44 లక్షల మంది రైతులకు 5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు భూమి ఉన్నది. 10 నుంచి 25 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులు 94 వేల మంది కాగా, 25 ఎకరాల పైబడిన పెద్ద రైతులు రాష్ట్రంలో కేవలం 6,488 మంది మాత్రమే. ఇక 50 ఎకరాలకు పైబడిన రైతులు వేళ్లవిూద లెక్కపెట్ట గలిగినంత మంది మాత్రమే ఉంటారని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతుల్లో అత్యధికంగా 90.5 శాతం మంది పేద రైతులే. కేవలం 9.5 శాతం మంది మాత్రమే దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి, పెద్ద రైతులు ఉన్నారు. రాష్ట్రంలో 57 లక్షల మంది రైతులు ఉండగా వారిలో దాదాపు 56 లక్షల మంది
సొంతంగానే సాగుచేసుకుంటున్నారు. వీరు తమ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూనే ఇతర రైతుల భూముల్లో కూడా పనులు చేస్తారు. కొంతమంది ఇతర పొలాల్లో కూలీలకు వెళతారు. కొందరు కూలికి కాకుండా పరస్పరం సహకరించుకుంటారు. దీనికి ప్రధాన కారణం.. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం. కూలి ఖర్చులు పెట్టేంత కూడా లాభసాటి కాకపోవడంతో నష్టాలను భరించలేని రైతులు ఇలా చేస్తున్నారు. చిన్న సన్నకారు రైతులు ఇతర కూలి పనులకు కూడా వెళుతున్నారు.
—————-