Thursday, 5 November 2026

సమ్మెపై పునరాలోచించుకోండి

రూ. 3వేల కోట్ల అప్పులో ఉన్నాం
ఏడాది రూ. 250కోట్లు వడ్డీ కడుతున్నాం
ప్రస్తుత పరిస్థితుల్లో జీతాలు పెంచితే అదనపు భారం పడుతుంది
సమ్మెబాట పడితే మరింత నష్టాల్లోకి వెళ్తాం
ఆర్టీసీ సంఘాల నేతలతో మంత్రి మహేందర్‌రెడ్డి
సమ్మెను వాయిదా వేయలేం
శనివారం చర్చించుకొని చెబుతాం
స్పష్టం చేసిన టీఎంయూ సభ్యులు
హైదరాబాద్‌, జూన్‌8(జ‌నం సాక్షి) : ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున సమ్మెపై కార్మిక సంఘాలు పునరాలోచించుకోవాలని తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఆర్డీసీ సంఘాల నేతలను కోరారు.  శుక్రవారం ఆర్టీసీ గుర్తింపు సంఘం టీఎంయూ నేతలతో మంత్రి సమావేశమయ్యారు. ఆర్టీసీకి సుమారు రూ.3వేల కోట్ల అప్పు ఉందని.. దానికి ఏడాదికి రూ.250 కోట్ల వడ్డీ కడుతున్నామని మంత్రి తెలిపారు. సంస్థకు ఏటా రూ.700కోట్ల నష్టం వస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులకు జీతాలు పెంచితే సంస్థపై అదనంగా రూ.1,400 కోట్లు భారం పడుతుందని తెలిపారు. కార్మికులతో పాటు 4.5కోట్ల ప్రజల ప్రయోజనాలు ప్రభుత్వానికి ముఖ్యమని స్పష్టం చేశారు. సంస్థను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని.. కార్మికులు తప్పుడు ఆలోచనలతో సమ్మెకు దిగడం సరికాదని మంత్రి కోరారు.
సమ్మె వాయిదా వేయలేం..
టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డి స్పందిస్తూ… ఇప్పటికైతే సమ్మె వాయిదా వేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. శనివారం మధ్యాహ్నం కార్మిక సంఘాలతో సమావేశమై తదుపరి నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఆర్టీసీ నూటికి నూరుపాళ్లు లాభాలతో నడిచే సంస్థ అని అన్న అశ్వత్థామరెడ్డి.. తమ సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పష్టమైన హావిూ రాలేదన్నారు. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పట్నుంచే ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయన్నారు. ఉద్యమం తర్వాతే సంస్థ నష్టాల పాలైనందున ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీలో ఎన్నికలు జరపాలా? వద్దా? అన్నది ప్రభుత్వ నిర్ణయమని.. ఎన్నికలను రద్దు చేయాలనే తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.