– అక్కడి నుండి బాబుకు ప్రత్యేక ఆహ్వానమే రాలేదు
– ఏపీని సింగపూర్ కంపెనీలకు చంద్రబాబు దోచి పెడుతున్నాడు
– ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా ఏపీకి ఎన్ని పెట్టుబడులు వచ్చాయో చెప్పాలి
– పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
హైదరాబాద్, జులై13(జనం సాక్షి) : ఆంధప్రదేశ్‌తో సింగపూర్ వాళ్లే లబ్ధి పొందుతున్నారని, కానీ వారి వల్ల రాష్ట్రానికి ఒరిగిందేం లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏపీని సింగపూర్ కంపెనీలకు దోచిపెడుతున్నాడని ఆరోపించారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ గత నాలుగేళ్లలో ఆరు పర్యాయాలు సింగపూర్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ఏం సాధించారో చెప్పాలని బుగ్గన ప్రశ్నించారు. సింగపూర్ సదస్సుకు చంద్రబాబును ఎవరూ పిలువలేదన్నారు. కానీ టికెట్టు కొనుక్కుని మరీ చంద్రబాబు ఆ సదస్సుకు వెళ్లారని తెలిపారు. అమరావతిలో అందరూ ఎలక్టిక్ర్ బైక్స్‌లో తిరుగుతున్నట్లు చంద్రబాబు సింగపూర్‌లో ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హావిూని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత ఎక్కువ విదేశీ పర్యటనలు చేసింది చంద్రబాబేనని, కానీ వాటి వల్ల రాష్ట్రానికి ఖర్చులు తప్ప ఏపీకి ఏ ప్రయోజనం చేకూరలేదన్నారు. రాష్ట్రాన్ని సింగపూర్ కంపెనీలకు తాకట్టు పెడుతూ మాటలతో ఏపీ ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేశానని సమావేశాల్లో రైతులతో బలవంతంగా పలికిస్తూ ఆ విషయాలను వారి అనుకూలమైన విూడియాలో విస్తృత ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. అర్థంకాని రీతిలో మాట్లాడే కళ చంద్రబాబులో ఉందని ఎద్దేవా చేశారు. ఆయన ఎక్కడికి వెళ్లినా మంత్రి యనమల రామకృష్ణుడిని తోడు ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు.
మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు వెళ్లాల్సిన సమావేశాలు, కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరు కావడమే తప్పు అయితే ఆయన వెంట మంది మార్భలంతో వెళ్లడం సరికాదని హితవు పలికారు. తనకు ధైర్యం చెప్పేందుకే యనమలను చంద్రబాబుకు ఆయన వెంట తీసుకెళ్తున్నారని ఎద్దేవా చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే వాణిజ్యం సులభంగా చేయడంలో ఏపీ నంబర్ వన్ అని ఊదర గొడుతున్నారని తెలిపారు. రాష్ట్రం బాగుపడితే అందరూ మద్దతిస్తారని, టీడీపీ చేసే తప్పుడు ప్రచారంతో ఏపీ పరువు పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2016-2017లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నంబర్ వన్‌గా నిలిచిందని ప్రచారం చేసుకుంటున్నారు గానీ ఎన్ని కంపెనీలు ఏపీకి వచ్చాయో.. వాటి ద్వారా ఎన్నికోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయో చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు.




