మరో నలుగురి ఆచూకీ కోసం గాలింపు
పెద్దపల్లి,మార్చి8(జనం సాక్షి):పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ సింగరేణిలోని బొగ్గు గనిలో పైకప్పు కూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఏడుగురు పనిచేస్తుండగా ఒకరు మాత్రమే సురక్షితంగా బయటకు రాగా ఆరుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. తొలుత వారు మరణించారని ప్రచారం జరిగింది. అయితే సోమవారం రాత్రి సమయంలో ఇద్దరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. మరో నలుగురు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు సహాయక బృందం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. కాగా ఆండ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు భూగర్భ బొగ్గు గనిలో పైకప్పు కూలిన సమయంలో ఎస్‌బీఎల్ యంత్రం క్యాబిన్‌లో ఉండగా యంత్రం బయట ఉన్న వీరయ్య స్వల్ప గాయాలతో వెలుపలకు వచ్చారు. ప్రమాదం గురించి అధికారులకు సమాచారం అందించారు. ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక బృందం తక్షణమే సంఘటన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.ఇదిలావుంటే గని ప్రమాదం నుండి ప్రాణాలతో వస్తా అని అనుకోలేదనిమైనింగ్ సర్దార్ నరేష్ అన్నారు. సింగరేణి రామగుండం ఆర్జీ 3 ప్రమాదం నుంచి రేష్ క్షేమంగా బయటపడ్డాడు. నాకు ఇది పునర్జన్మ. 86 లెవల్ వద్ద ఎస్‌డిఎల్ ఆపరేటర్ వెంకటేశ్వర్లు, నేను ఉన్నాం. అకస్మాత్తుగా పై కప్పు కూలింది. గజగజ వణికి పోయాం. వెంకటేశ్వర్లు మిషన్‌పై కూర్చున్నాడు. నేను బండి కిందికి వెళ్లి దాక్కున్నా. నాకు ఇది నిజంగా పునర్జన్మనే..‘ అనే నరేష్ అన్నారు. నిన్న రామగుండం ఆర్జీ`3లో పైకప్పు కూలిని ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే.




