Tuesday, 3 November 2026

సిఐటియు బాలానగర్ మండల నూతన కమిటీ ఎన్నిక..

కన్వీనర్ గా ఐలాపురం రాజశేఖర్…
కూకట్ పల్లి (జనంసాక్షి ):
కార్మికుల శ్రమకు తగ్గ ఫలితం లభించకపోవడంతో కార్మికుల కుటుంబాల పోషణ భారమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు అమలు చేయకుండా ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుండడంతో కార్మికులు ఇబ్బందులు అధికమయ్యాయని సిఐటియు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఏర్రం అశోక్ అన్నారు.ఆదివారం బాలానగర్ డివిజన్ పరిధిలో సిఐటియు మూడవ మహాసభలను మండల కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు.మహాసభలకు ముఖ్య అతిథిగా ఏర్రం అశోక్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంలోని గుత్త సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు కలిసి దేశ ఆర్థిక స్వావలంబనకు ప్రమాదం తెచ్చి పెడుతున్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ప్రభుత్వ రంగాలపై, జాతీయ స్థూల ఉత్పత్తి వృద్ధిలో క్రియాశీల భూమిక పోషిస్తున్న కార్మిక వర్గంపైన ముప్పేటా దాడి చేస్తున్నాయన్నారు. ఆ దోపిడీ శక్తులకు వత్తాసు పలుకుతూ కేంద్రం లోని బిజెపి 44 లేబర్ చట్టాలను 4 కోడ్ లుగా తీసుకొచ్చి కార్మికుల పొట్ట కొడుతున్నారని ఆయన అన్నారు. కార్పొరేట్లకు మేలు చేసే విధంగా కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం సవరించిందని ఆరోపించారు. కొత్తగా వచ్చిన లేబర్‌ కోడ్ల వల్ల కార్మిక వర్గం తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబదుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ, వేతనాలు, పెన్షన్లలో కోతలు విధించడం, లేఆఫ్‌, సంఘం పెట్టుకొనే హక్కునే హరించివేయడం, ఉమ్మడి బేరసారాలాడి కార్మికుల శక్తిని బలహీనపరచడం, న్యాయబద్ధమైన, శాంతియుతమైన నిరసనలను కూడా సహించ లేని వాతావరణం నెలకొన్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితులలో కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్దం కావాలని ఆయన పిలుపునచ్చారు. అనంతరం సీఐటీయూ నూతన కమిటీ నీ ప్రకటించారు.కన్వీనర్ గా ఐలాపురం రాజశేఖర్, కో కన్వీనర్ గా లక్ష్మణ్,సుల్తాన్, సుబ్బారావు, ఆనంద్,వనిత, జైథున్, శంకర్, రాములు,నరేందర్ గౌడ్ లను మండల కమిటీ సభ్యులు ఎన్నికైనారు.ఈ కార్యక్రమంలో జగన్, సుగుణ, యాకన్న,భాగ్యలక్ష్మి, సులోచన, లాజర్ తదితరులు పాల్గొన్నారు.